మార్చి 2 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు..

27 Nov, 2015 03:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి మొదలయ్యే తెలంగాణ పరీక్షలతోపాటే ప్రారంభించేలా షెడ్యూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు సంతకం చేశారు. ఇంటర్ బోర్డు దీనిపై అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రశ్నపత్రాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటున్నందున..

వేర్వేరు తేదీల్లో ఈ పరీక్షలు జరిగే సమయంలో ముందుగా పరీక్ష జరిగే రాష్ట్రం పేపర్లను ప్రైవేటు కళాశాలల వారు మరో రాష్ట్రానికి పంపి కాపీలు చేయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తాను ముందుగా ప్రకటించిన(మార్చి 11 నుంచి 30వ తేదీవరకు) షెడ్యూల్‌కు బదులు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను అనుసరించాలని నిర్ణయించింది.

మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించేలా తెలంగాణ షెడ్యూల్ వెలువడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేసిన ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఫైలును మంత్రి ఆమోదానికి పంపింది.

మరిన్ని వార్తలు