ఐఓసీకి నిల్వ నష్టాల భారం

4 Nov, 2015 00:54 IST|Sakshi
ఐఓసీకి నిల్వ నష్టాల భారం

రెండో త్రైమాసికంలో రూ.329 కోట్ల నష్టం
 
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు  ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండడం, నిల్వ నష్టాలు భారీగా ఉండడం, విదేశీ  మారక ద్రవ్య నష్టాలు.. ఈ అంశాలన్నింటి కారణంగా నష్టాలు వచ్చాయని ఐఓసీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు నష్టాలు రూ.898 కోట్లుగా ఉన్నాయని ఐఓసీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. అమ్మకాలు, సామర్థ్య నిర్వహణ, ఇతర రంగాల్లో మంచి పనితీరు కనబరిచామని, కానీ నిల్వ నష్టాలు ప్రభావం చూపాయని వివరించారు. తాము ముడి చమురు కొనుగోలు చేసినప్పుడు ఒక ధర ఉండేదని, దానిని ఇంధనంగా ప్రాసెస్ చేసిన తర్వాత ధర తగ్గిపోయేదని తెలియజేశారు. దీనికి రవాణా, ప్రాసెసింగ్ వ్యయాలు కూడా కలుపుకుంటే నిల్వ నష్టాలు మరింత పెరిగాయని వివరించారు. ప్రధానంగా ఈ కారణాల వల్లే క్యూ2లో రూ.5,137 కోట్ల నిల్వ నష్టాలు వచ్చాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ఈ నిల్వ నష్టాలు రూ.4,272 కోట్లన్నారు.

 పెరిగిన ఫారెక్స్ నష్టాలు...
 గత క్యూ2లో రూ.672 కోట్లుగా ఉన్న విదేశీ మారకద్రవ్య నష్టాలు ఈ క్యూ2లో రూ.1,100 కోట్లకు పెరిగాయని, గత క్యూ2లో రూ.1,039 కోట్లుగా ఉన్న వడ్డీ వ్యయాలు ఈ క్యూ2లో రూ.729 కోట్లకు తగ్గాయని అశోక్ తెలియజేశారు. ఒక్కో బ్యారెల్ చమురును ఇంధనంగా మార్చడానికి అయిన స్థూల రిఫైనింగ్ మార్జిన్ గత క్యూ2లో మైనస్ 1.95 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 90 సెంట్లుగా ఉందని చెప్పారు. నిల్వ నష్టాలు లేకపోతే ఈజీఆర్‌ఎం ఈ క్యూ2లో 6.92 డాలర్లుగా ఉండేదని వివరించారు. గత క్యూ2లో రూ.1,11,664 కోట్లుగా ఉన్న టర్నోవర్ చమురు ధరలు తగ్గడం వల్ల ఈ క్యూ2లో రూ.85,385 కోట్లకు తగ్గిందని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు