ఐపీఎల్ బుకీలపై పంజా.. భారీ సొత్తు స్వాధీనం

22 Apr, 2017 19:16 IST|Sakshi
శనివారం మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌, పుణె కెప్లెన్ల ఆలింగనం

హైదరాబాద్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పంజా విసిరారు. శనివారం హైదరాబాద్‌, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పోలీసులు దాడిచేసి ఇద్దరు బుకీలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి లక్షల్లో నగదు సహా టీవీ, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌. కోటిరెడ్డి వెల్లడించిన వివరాలివీ..

సికింద్రాబాద్‌ బేగంపేట్‌ పాటిగడ్డ కాలనీకి చెందిన నితీష్‌ సింగ్‌ ఠాకూర్‌ (23), ఉప్పల్‌ బాలాజీ హిల్స్‌ ప్రాంతానికి చెందిన హరి విశాల్‌ (28) జట్టుగా ఏర్పడ్డారు. వీరు 2015 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు, వన్డే, టెస్టు, ఐపీఎల్, చాంపియన్స్‌ ట్రోఫీల సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతుంటారు. ఇందులో భాగంగా నితీష్‌ సింగ్, హరి విశాల్‌లు షాహినాథ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌ కుమార్‌ (35), జాంబాగ్‌కు చెందిన మోహిత్‌ (32) కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి నితీష్‌ సింగ్‌ను అబిడ్స్‌లో, మనోజ్‌ కుమార్‌ షాహినాథ్‌గంజ్‌లో అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,01,500 నగదు, ఒక ఎల్‌ఈడీ టీవీ, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బేగంపేట్, షాహినాథ్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. నితీష్‌ సింగ్, మనోజ్‌ కుమార్‌లు మోహిత్, హరివిశాల్‌లతో కలిసి 2015 నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. 2015లో మనోజ్‌ కుమార్‌పై షాహినాథ్‌ గంజ్, హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధం కలిగి ఉన్న కేసులు నమోదై ఉన్నాయి. నితీష్‌ సింగ్‌ తనకు వరుసకు సోదరుడయ్యే హరివిశాల్‌ సహయంతో ఫంటర్స్‌ వద్ద డబ్బులు కలెక్ట్‌ చేసేవాడు. ఈ కేసులో మోహిత్, హరివిశాల్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు