ఐపీఓల కన్నా ఎఫ్‌డీలే మిన్న!

8 Apr, 2015 01:12 IST|Sakshi
ఐపీఓల కన్నా ఎఫ్‌డీలే మిన్న!

న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఐపీఓల్లో కన్నా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) లోనే రాబడులు అధికంగా వచ్చాయని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఎస్ తెలిపింది. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడమనేది జూదంగా మారిపోయిందని పేర్కొంది.  పలు కంపెనీలు ఐపీఓల కోసం క్యూ కట్టిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం. 2003, ఏప్రిల్ 1 నుంచి 2014, జూలై మధ్యకాలంలో వచ్చిన 394 ఐపీఓలపై అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..,

 2003, ఏప్రిల్ నుంచి వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో 60 శాతం మంది సొమ్ములు పూర్తిగా కరిగిపోయాయి.
 గత పదేళ్లలో వచ్చిన ఐపీఓల పనితీరు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచలేకపోయింది.
 ఐపీఓల్లో ఆఫర్ చేసిన ధర కంటే అధిక ధరకు ట్రేడవుతున్న కంపెనీలు 42 శాతంగానే (162) ఉన్నాయి. అయితే ఈ ఐపీఓల ద్వారా పెద్దగా రాబడులేమీ రాలేదు.
 బుల్ రన్‌లోనే ఐపీఓలకు ఈ స్థాయి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
 ఈ కాలంలో వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే వచ్చేవి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా దక్కేవి.
70 శాతం (245) కంపెనీల షేర్ల ధరలు ఆఫర్ ధర కంటే తక్కువగానే ట్రేడవుతున్నాయి.
 ఈ కాలంలో మొత్తం ఇరవై ప్రభుత్వ రంగ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వీటిల్లో నాలుగు కంపెనీలు(ఎంఓఐఎల్, ఎన్‌హెచ్‌పీసీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షేర్ల ధరలు ఐపీఓ ఆఫర్ ధర కన్నా తక్కువగా ట్రేడవుతున్నాయి.
 తగిన నియమనిబంధనలను పాటించలేదన్న కారణంగా ఈ కాలంలో వచ్చిన మొత్తం ఐపీఓల్లో 25 కంపెనీల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ లు నిలిపేశాయి.
 

మరిన్ని వార్తలు