అన్ని అవసరాలకు ఒకే పాలసీ

9 Jan, 2014 01:25 IST|Sakshi
అన్ని అవసరాలకు ఒకే పాలసీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రజల కనీస బీమా అవసరాలను తీర్చుకోవడానికి ఇప్పుడున్న బహుళ పథకాల విధానం దేశీయ బీమా వృద్ధికి ప్రతిబంధకంగా ఉందని, ఇలా కాకుండా కనీస అవసరాలన్నీ తీర్చేవిధంగా ఒకే పథకాన్ని తీసుకురావల్సిన అవసరం ఉందని ఐఆర్‌డీఏ ప్రకటించింది. జీవిత బీమా, ఆరోగ్యం, వాహనం, అగ్ని ప్రమాదం ఇలా విభిన్న అవసరాల కోసం విడివిడిగా పాలసీలను తీసుకోవాల్సి వస్తోందని, ఇది బీమా విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉందని బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. అసోచామ్ బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఏడవ అంతర్జాతీయ బీమా సదస్సులో పాల్గొన్న ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలసీదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకునేలా జీవిత, సాధారణ బీమా పథకాలను కలిపి ఒకే పథకం కింద అందించాల్సిన అవసరం ఉందన్నారు.   
 
 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీమా రంగంలో ఉన్న పోకడలను సునిశితంగా విమర్శించారు. కంపెనీలు పథకాలను విక్రయించేటప్పుడు పాలసీదారులపై చూపిస్తున్న ప్రేమ క్లెయింలు వచ్చినప్పుడు ఉండటం లేదని, దీనిపై ఐఆర్‌డీఏ దృష్టిసారించాలన్నారు. వైద్య, పంటల, సాధారణ బీమా రంగాల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సులభమైన పాలసీలను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీమా, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు