ఉక్కుమహిళకు పెళ్లి కుదిరింది

5 May, 2017 16:13 IST|Sakshi
ఉక్కుమహిళకు పెళ్లి కుదిరింది

ఇంఫాల్‌: ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే ఆ రాష్ట్ర ఉక్కు మహిళ, పోరాటయోధురాలు ఇరోం షర్మిల త్వరలో తన బాయ్‌ఫ్రెండ్‌ డెస్మండ్‌ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ ధ్రువీకరించారు. కాగా వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ జంట అక్కడే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్‌ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు.

షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో 2011లో ఆమెకు తొలిసారి బ్రిటీష్‌ పౌరుడు డెస్మండ్‌ పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకున్నారు. వివాహం బంధంతో తామిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు డెస్మండ్‌ చెప్పారు. అనుమతులు తీసుకున్నాక తమిళనాడులోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ధ్రువీకరించారు.

ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేసిన దీక్షను షర్మిల విరమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఘోర పరాజయం ఎదురైంది. థౌబాల్‌ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేయగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరిన్ని వార్తలు