ఖరీఫ్ సాగుకు జలగండం!

7 Jun, 2015 03:52 IST|Sakshi
ఖరీఫ్ సాగుకు జలగండం!

♦ వట్టిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, 428 టీఎంసీల నీటి కొరత
♦ వర్షాలు కురిసినా ఆగస్టు వరకు ఆయకట్టుకు నీటిపై చెప్పలేని స్థితి
♦ తాగునీటి అవసరాలకు సరిపడే నీరొచ్చాకే ఖరీఫ్‌పై ప్రభుత్వ నిర్ణయం
♦ సకాలంలో వర్షాలు రాకుంటే 15 లక్షల ఎకరాలపై ప్రభావం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణా, గోదావరి నది పరీవాహక పరిధిలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోయి నిర్జీవంగా మారడం ఖరీఫ్ సాగును కలవరపెడుతున్నాయి. నిర్ణీత సమయానికే వానలొచ్చినా ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి మట్టాలను చేరుకోవాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందేనన్న సంకేతాలు సైతం ఖరీఫ్‌ను ఆందోళనలోకి నెడుతున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులుంటాయన్న ఆందోళన ఓ వైపు, ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలు మరోవైపు సాగును ప్రశ్నార్థకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగుపై ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

 428 టీఎంసీల మేర కొరత..
 తీవ్ర నీటి ఎద్దడి దృష్ట్యా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టుల్లో కనీస మట్టాల దిగువకు వెళ్లి నీటిని వాడేయడంతో ఆయా ప్రాజెక్టుల్లో మట్టాలు గణనీయంగా తగ్గాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో వాస్తవ నీటి నిల్వలు 681 టీఎంసీలు కాగా ప్రస్తుతం 253 టీఎంసీల మేర మాత్రమే నిల్వలున్నాయి. మరో 428 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలతో పోల్చిచూసినా 45 టీఎంసీల మేర తక్కువగా నిల్వలు ఉన్నాయి. జూన్‌లో సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిండాల్సిన అవసరం ఉంటుంది.

అక్కడ నిండాకే దిగువకు నీరు చేరే అవకాశాలుంటాయి. అది జరగడానికి నెలక న్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు మొదటివారానికి గానీ ఖరీఫ్ ఆయకట్టుపై  స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవేళ పూర్తిగా వర్షాభావ పరిస్థితులే నెలకొంటే ఖరీఫ్ మొత్తంపైనా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది.

 పదిహేను లక్షల ఎకరాలపై ప్రభావం
 సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పక్షంలో ఆ ప్రభావం మొత్తంగా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో కెనాల్‌ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండగా, జూరాల కింద లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టం అవుతుంది. దీనికి తోడు ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఇచ్చంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద కొత్తగా ఈ ఖరీఫ్‌కు 6.2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించారు. ఒకవేళ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే ఈ ఆయకట్టుకు గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు