బాంబుదాడిలో ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ హతం

27 Apr, 2015 17:24 IST|Sakshi
బాంబుదాడిలో ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ హతం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మరణించాడు. అతడి మృతిని ఇరాన్ రేడియో ధ్రువీకరించింది. ఇటీవలే అమెరికా సైన్యాలు వైమానిక మార్గంలో చేసిన క్షిపణి దాడిలో అల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. సిరియా సరిహద్దుల్లోని అల్బాజ్  జిల్లా నైన్వేలో కురిపించిన బాంబుల వర్షంలో బాగ్దాదీకి గాయాలయ్యాయి. ఆ గాయంతో బాధపడుతూనే బాగ్దాదీ మరణించినట్లు ఇరాన్ రేడియో స్పష్టం చేసింది.

కాగా బాగ్దాదీ తలకు ఇప్పటికే అమెరికా రూ. 65 కోట్ల వెల కట్టింది. గత జూలై నెలలో చివరి సారిగా బాగ్దాద్లోని ఓ మసీదులో బాగ్దాదీ ప్రసంగించాడు. ఆ తర్వాత ఎప్పుడూ బయట కనిపించలేదు. కాగా, పాశ్చాత్య దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్కు బాగ్దాదీ మరణం పెద్ద దెబ్బ అవుతుంది. అనేకమందిని పీకలు కోసేసి హతమార్చి, ఆ వీడియోలను సైతం ఆన్లైన్లో పోస్ట్ చేసి భయానక వాతావరణాన్ని ఐఎస్ఐఎస్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ రాజ్యం అన్న నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లి, ఐఎస్ఐఎస్ను అల్ బాగ్దాదీ స్థాపించాడు. అలాగే ఐఎస్ఐఎస్ను టెర్రరిస్టు గ్రూపుగా మార్చడంలో కూడా అల్ బాగ్దాదీ కీలకపాత్ర పోషించాడు. అత్యంత కిరాతకంగా హత్యలు చేయాలంటూ తన 'సైన్యాన్ని' ఆదేశించి అగ్రరాజ్యాలను వణికించాడు.

మేం నమ్మం: అమెరికా
అయితే.. అమెరికా మాత్రం బాగ్దాదీ మరణించిన విషయాన్ని తాము నమ్మేది లేదని చెబుతోంది. అతడి మృతదేహాన్ని చూసేవరకు ఈ కథనాలను విశ్వసించబోమని పెంటగాన్ తెలిపింది. గతంలో కూడా ఇలాంటి వదంతులతో తమ దృష్టిని మళ్లించారని చెప్పింది.

మరిన్ని వార్తలు