'లైంగిక హింసతో విధ్వంసం సృష్టిస్తున్నారు'

9 Sep, 2015 12:49 IST|Sakshi
'లైంగిక హింసతో విధ్వంసం సృష్టిస్తున్నారు'

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలపై హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీ తీవ్రస్థాయిలో మండిపడింది. వాళ్లు అత్యాచారాలను ఉగ్రవాదానికి కేంద్రస్థానంగా వాడుకుంటున్నారని, వాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో లైంగిక హింసతో విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పింది. పార్లమెంటు ఉభయసభలకు ఆమె ఈ విషయాలు వెల్లడించింది. నటన ఆమె వృత్తి కాగా, మానవహక్కుల పరిరక్షణ ఆమె ప్రవృత్తి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటించిన జోలీ.. కనీసం ఏడేళ్ల వయసున్న అమ్మాయిలను కూడా ఆ ముష్కరులు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

జీహాదీ ఛాందసవాదులు ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఉన్న ఉగ్రవాదులని, వాళ్లు లైంగిక దాడులను కూడా చాలా సమర్ధమైన ఆయుధంగా వాడుకుంటున్నారని లార్డ్స్ కమిటీకి జోలీ చెప్పింది. ఇరాక్, సిరియాలు కేంద్రంగా సాగుతున్న ఐఎస్ఐఎస్ చేసినన్ని ఆగడాలు ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరని చెప్పింది. వీళ్లకు అత్యాచారాలు చేయడం ఒక విధానంగా మారిపోయిందని, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని.. ఐఎస్ఐఎస్ సంస్థ మీద చాలా బలమైన చర్య తీసుకోవాలని జోలీ కోరింది. 'ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ' పేరుతో తాను తీసిన సినిమా కాపీలను కూడా కమిటీ సభ్యులకు ఇచ్చింది.

మరిన్ని వార్తలు