ఐసిస్ చీఫ్‌ పారిపోయాడు..

4 Nov, 2016 16:44 IST|Sakshi
ఐసిస్ చీఫ్‌ పారిపోయాడు..

బాగ్దాద్: ఇరాక్లోని మోసుల్ నగరం నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ వెల్లడించింది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు.

ఐఎస్ ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియోను గురువారం విడుదల చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మోసుల్ కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకముందని, ఇరాక్ భద్రత దళాలపై పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బాగ్దాదీ తన అనుచరులను ఆదేశించాడు. ఇరాక్ దళాలను ఎదుర్కోవడంలో వెనుకంజవేయవద్దని సూచించాడు. దీన్నిబట్టి బాగ్దాదీ మోసుల్ నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపినట్టు బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

మోసుల్ నగరం 2014 నుంచి ఐఎస్ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉంది. ఈ నగరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం కోసం ఇరాక్ భద్రత బలగాలు పోరాటం చేస్తున్నాయి. దీంతో భద్రత దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ ఉగ్రవాదులు.. పిల్లలు, మహిళలు సహా వేలాదిమందిని బంధించి, ఇరాక్ భద్రత బలగాలతో పోరాటంలో వారిని మానవ కవచాల్లా వాడుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మోసుల్ నగరంలో 3 వేలమంది నుంచి 5 వేలమంది వరకు ఐఎస్ ఉగ్రవాదులు ఉండవచ్చని అమెరికా సంకీర్ణ దళాలు అంచనా వేస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు