ఫేస్‌బుక్‌పై నిషేధం?

22 Mar, 2017 17:49 IST|Sakshi
ఫేస్‌బుక్‌పై నిషేధం?

దైవదూషణకు పాల్పడే కామెంట్లకు అవకాశం ఇస్తున్న ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాపై నిషేధం విధించాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ విషయమై మార్చి 27వ తేదీన జరిగే తదుపరి విచారణ నాటికి ఒక నిర్ణయం తీసుకుంటామని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షౌకత్ అజీజ్ సిద్దిఖీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దైవదూషణకు సంబంధించిన విషయాలను వ్యాపింపజేస్తున్నారని, అందువల్ల వాటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ విషయం తెలిపింది. అసలు సోషల్ మీడియాలో నిజంగానే అలాంటి కంటెంట్ వస్తోందా లేదా అన్న విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ)ను కోర్టు ఆదేశించింది.

తాము ఇప్పటికే విచారణ పూర్తిచేశామని, రెండు రోజుల క్రితమే ఒక కేసు కూడా నమోదు చేశామని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దైవదూషణకు సంబంధించిన అంశాలను వ్యాపింపజేస్తున్నందుకు ఇంతకుముందు ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నామని, అవి ఫోరెన్సిక్ అధికారుల వద్ద ఉన్నాయని అన్నారు.

ముగ్గురు నిందితులపై పటిష్ఠమైన నిఘా ఉంచామని, మరికొందరు నిందితుల పేర్లను కూడా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చామని ఎఫ్ఐఏ డీజీ చెప్పారు. దైవదూషణకు సంబంధించిన, అభ్యంతరకరమైన కంటెంట్ విషయంలో తమ అభిప్రాయాలను ఫేస్‌బుక్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. దీనిపై ఒక బృందాన్ని పంపేందుకు కూడా ఫేస్‌బుక్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ఫేస్‌బుక్ యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలని, అంతవరకు మాత్రం పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తేనే మంచిదని జస్టిస్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు