-

ఐఎస్‌ఎస్‌@15

9 Nov, 2015 04:05 IST|Sakshi
ఐఎస్‌ఎస్‌@15

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)... కేవలం ఒక పరిశోధనా స్థానం మాత్రమే కాదు, సువిశాల విశ్వ పరిశోధనలో మనిషి చేరుకున్న ఒక గమ్యస్థానం. భూమ్మీద జనాభా పెరుగుతోంది. వాళ్ల కోసం అదనపు నివాస స్థలాలను వెతకాల్సిందే. మనకు సరిపడే వాతావరణం ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? మన అనుభవాలను పంచుకోగలిగే వాళ్లు ఈ విశాల విశ్వంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఐఎస్‌ఎస్ ఒక మెట్టులాంటిది. దీని తర్వాత ఈ తరహా పరిశోధనకు చంద్రుడు, ఆ తర్వాత కుజుడు.. ఇంకా వేరే వేరే గ్రహాలున్నాయి. భూమికి సుమారు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్న ఐఎస్‌ఎస్ ప్రస్థానంలో తాజాగా పదిహేను సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000 సంవత్సరం నవంబర్ ఆరంభం నుంచి వివిధ దేశాల సహకారంతో నాసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్పేస్ స్టేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇవి.
      - సాక్షి సెంట్రల్ డెస్క్
 
  మనిషి నిర్మించిన వాటిలో అత్యంత ఖరీదైనది
 మనిషి తన నాగ రకతలో ఇప్పటి వరకూ నిర్మించిన వాటన్నింటిలోనూ అత్యంత ఎక్కువ ఖర్చు చేసిన నిర్మాణం ఐఎస్‌ఎస్. 2010 లెక్కల ప్రకారం ఐఎస్‌ఎస్ దాదాపు 15,000 కోట్ల డాలర్ల విలువ చేస్తుంది. ఇందులో సగం మొత్తాన్ని అమెరికా మాత్రమే భరించగా, మిగిలిన మొత్తాన్ని యూరప్ దేశాలు కొన్ని, జపాన్, రష్యాలు వెచ్చించాయి.  

  211 మంది సందర్శించారు
 పదిహేను దేశాలకు చెందిన 211 మంది వ్యోమగాములు ఇప్పటి వరకూ ఐఎస్‌ఎస్‌ను సందర్శించారు. వీరిలో భారత సంతతికి చెందిన పలువురు వ్యోమగాములున్నారు.

  మనిషే ఒక ప్రయోగశాల
 ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాముల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. భారరహిత స్థితిలో వారు మనుగడ సాగించాలి. ఆ స్థితిలో ఏం తినాలి? తింటే ఏం జరుగుతుంది? ఎలా జీర్ణమవుతుందనే అంశాలపైనా పరిశోధనలు జరుగుతాయి.

  చిత్రమైన జీవితం
 కింద, పైన అనేవి కేవలం భూమ్మీద. భారరహిత స్థితిలో ఉండే ఈ స్టేషన్‌లో అంతా ఒక్కటే. స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. నిద్రపోవడం అనేది మరో చిత్రమైన విన్యాసం. పడక, దిండూ.. అంటూ ఏమీ ఉండవు. తేలుతూ నిద్రపోవాలంతే! తినడం మరో కష్టమైన ఫీట్. పదార్థాలు అన్నీ తేలుతూ ఉంటాయి. పట్టుకొని తినాలి.

  గంటకు 17,240 మైళ్ల వేగం
 గంటకు 17,240 మైళ్ల వేగంతో తన కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఐఎస్‌ఎస్. ఈ వేగాన్ని మరో రకంగా వివరించాలంటే ఐఎస్‌ఎస్ రోజుకు దాదాపు పదిహేను సార్లు భూమిని చుట్టేస్తూ ఉంటుంది. ఒక రోజులో ఐఎస్‌ఎస్ ప్రయాణించే దూరం భూమి నుంచి చంద్రునికి మూడు సార్లు ప్రయాణం చేయడంతో సమానం.

మరిన్ని వార్తలు