వారం మధ్యలో బ్రేక్ ఇస్తే!

21 Oct, 2015 15:42 IST|Sakshi
వారం మధ్యలో బ్రేక్ ఇస్తే!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అన్నిరకాలుగా ఒత్తిడి పెరిగిపోతోంది. వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవులు వెంటవెంటనే రావడంతో ఆ రెండు రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. దీనికి తోడు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు.. ఇలా అన్నిచోట్లా ఆ రెండు రోజులు విపరీతమైన రద్దీ ఉంటోంది. దీనంతటికీ పరిష్కారంగా వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవును కొద్దిగా మార్చి, ఆదివారం ఒక రోజు.. వారం మధ్యలో మరో రోజు ఇస్తే ఎలా ఉంటుందని బెంగళూరులోని కొన్ని దిగ్గజ ఐటీ  కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ విషయాన్ని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) ఎంఏ సలీం కూడా నిర్ధరించారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న మాన్యత టెక్ పార్కులోను, వైట్‌ఫీల్డ్, ఐటీబీపీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇచ్చే వారాంతపు సెలవుల పద్ధతిని మార్చేందుకు ఓకే అంటున్నాయని ఆయన చెప్పారు. ఇదే అన్ని రకాలుగా మంచిదని తాము కూడా చెబుతున్నామని, దానివల్ల రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గడంతో పాటు, ఉద్యోగులకు కూడా ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐదు రోజుల పాటు వరుసగా పనిచేయడం వల్ల ఉద్యోగులకు చాలా ఒత్తిడి ఉంటుందని, ఇంత ఎక్కువ స్థాయిలో ఒత్తిడి ఉండే ఉద్యోగాలలో వరుసగా పనిచేయించడం తమకూ అంత మంచిది కాదని, అదే మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇస్తే.. వాల్లు మరింత ప్రశాంతంగా పని చేయగలుగుతున్నారని సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ అనురాగ్ పటేల్ చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి చాలావరకు ఉద్యోగులు విపరీతంగా ఒత్తిడికి గురై పబ్‌లకు వెళ్లిపోతున్నారని, ఈ ట్రెండు తగ్గాలంటే వారానికి రెండు రోజులు వరుసగా కాకుండా వేర్వేరుగా సెలవులు ఇవ్వడమే సరైన ఉపాయమని ఐటీ ఉద్యోగి అంకిత్ చెప్పాడు.

మరిన్ని వార్తలు