ఆప్ ఆరోగ్య మంత్రికి ఐటీ చిక్కులు

27 Sep, 2016 13:59 IST|Sakshi
ఆప్ ఆరోగ్య మంత్రికి ఐటీ చిక్కులు
న్యూఢిల్లీ : ఇప్పటికే పలు కుంభకోణాల్లో ఇరుక్కొని ఆప్ మంత్రులు ఆపసోపాలు పడుతుండగా.. తాజాగా మరో ఆప్ మంత్రికి సస్పెన్షన్ చిక్కు ఎదురుకాబోతుంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యేంద్ర జైన్కు ఐటీ శాఖ సమన్లు జారీచేసింది. కోల్కత్తాకు చెదిన సంస్థల పన్ను ఎగవేత కేసుల్లో సత్యేంద్ర జైన్కు సంబంధం ఉందనే ఆరోపణలపై ఆయనను అక్టోబర్ 4న తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఐటీ శాఖ ఆదేశించింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, గత నాలుగేళ్ల కాలంలో జరిపిన ఆదాయపు పన్ను రిటర్న్స్ వివరాలతో తమ ముందు హజరుకావాలని పేర్కొంది.
 
పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక ఉపశమనాల కేసు ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కోల్కత్తాలోని ఓ మూడు సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడి జరిపింది. ఆ రైడ్స్లో జైన్కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ కంపెనీలతో జైన్కు సంబంధం ఉన్నట్టు తెలుస్తుండటంతో, నిజంగా వాటితో జైన్కు సంబంధం ఉందా లేదా అనేది తేల్చడంపై ఐటీ శాఖ రంగంలోకి దిగింది.  ఈ విచారణ నిమిత్తం ఐటీ శాఖ జైన్కు సమన్లు జారీచేసింది.
 
అయితే దీనిపై స్పందించిన జైన్, తనను కేవలం సాక్షిగా మాత్రమే రావాలని ఐటీ శాఖ సమన్లను జారీచేసిందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అక్టోబర్ 4న ఐటీ శాఖ ముందు హాజరుకాబోతున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టానని, కానీ 2013 నుంచి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సత్యేంద్ర జైన్ను వెనక్కేసుకొచ్చారు. సత్యేంద్ర ఎలాంటి తప్పులెరుగరని చెప్పారు. ఒకవేళ సత్యేంద్ర తప్పుచేసినట్టు తేలితే, మంత్రి పదవినుంచి బయటికి పంపించడానికి కూడా వెనక్కాడని మరోవైపు హెచ్చరికలు కూడా చేశారు. 
>
మరిన్ని వార్తలు