బద్దలవుతున్న యాక్సిస్‌ బ్యాంకు బాగోతం!

15 Dec, 2016 15:23 IST|Sakshi
బద్దలవుతున్న యాక్సిస్‌ బ్యాంకు బాగోతం!

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో భారీఎత్తున సాగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్‌ బ్యాంకులో భారీగా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పాతనోట్ల మార్పిడి రాకెట్‌తో కుమ్మక్కయినందుకు న్యూఢిల్లీకి చెందిన యాక్సిస్‌ బ్యాంకు మేనేజర్లు ఇద్దరినీ ఈడీ అధికారులు అరెస్టు చేయగా... తాజాగా నోయిడా సెక్టర్‌-51లోని యాక్సిస్‌ బ్యాంకు శాఖలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఆదాయపన్ను (ఐటీ) అధికారులు గురువారం ఈ శాఖపై దాడులు నిర్వహించారు. ఈ యాక్సిస్‌ బ్యాంకు శాఖలో 20 బూటకపు కంపెనీల ఖాతాలు ఉన్నాయని, ఇందులో అక్రమార్కులు రూ. 60 కోట్లు డిపాజిట్‌ చేశారని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీ కనౌట్‌ ప్లేస్‌లోని యాక్సిస్‌ బ్యాంకు బ్రాంచ్‌లోనూ ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఢిల్లీలో గతంలో అరెస్టయిన యాక్సిస్‌ బ్యాంకు అధికారులను పోలీసులు గురువారం కోర్టు ముందు హాజరుపరిచారు.  ఈ నెల 26 వరకు వారిని  జ్యూడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇక, ఢిల్లీలోని చాందినీచౌక్‌కు చెందిన యాక్సిస్‌ బ్యాంకు శాఖలో ఐటీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ భారీగా అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తూ కోల్‌కతాలో యాక్సిస్‌ బ్యాంకుకు చెందిన డిప్యూటీ మేనేజర్‌ గతంలో అరెస్టైన సంగతి తెలిసిందే. గత నెల 8న పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత ఐటీ అధికారులు బ్యాంకులపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాక్సిస్‌ బ్యాంకులో సాగుతున్న అక్రమాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు