4 జిల్లాల్లో ‘నై’పుణ్య శిక్షణ!

4 Mar, 2016 01:18 IST|Sakshi
4 జిల్లాల్లో ‘నై’పుణ్య శిక్షణ!

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధుల్లోని శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోని నిరుద్యోగులతోపాటు ఆయా రంగాల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(కార్పొరేషన్) నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల తీరు అధ్వానంగా ఉంది. మరో 25 రోజుల్లో ప్రస్తుత ఆర్థికసంవత్సరం ముగియనుండగా, స్కిల్‌డెవలప్‌మెంట్ కింద రాష్ట్ర రాజధానిలో కనీసం ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోవడం గమనార్హం.

హైదరాబాద్‌తోపాటు మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కరికి కూడా నైపుణ్యాల మెరుగుదల కింద శిక్షణ ఇవ్వలేదు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 505, మిగతా 9 జిల్లాల్లో 500 చొప్పున అంటే 5,005 మందికి శిక్షణను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.10 కోట్లను కేటాయించారు. ఫిబ్రవరి ఆఖరుకల్లా మొత్తం 1,072 మందికి రూ.2.10 కోట్లే ఖర్చు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 మందికిగాను 380 మందికి, కరీంనగర్‌లో 224, నిజామాబాద్‌లో 220, నల్లగొండలో 102, మహబూబ్‌నగర్‌లో 86, ఖమ్మంలో 60 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు.
 
ఎస్టీలకూ అంతంతే: షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక కార్పొరేషన్(ట్రైకార్) ద్వారా భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు (ఆదిలాబాద్) ఐటీడీఏల పరిధిలో 7 వేల మందికి శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో వారిని నియమించేలా నిర్ణయించారు. అయితే 997 మందికి శిక్షణనిచ్చి, వారిలో 700 మందికి ప్లేస్‌మెంట్ ఇచ్చారు. నేరుగా ప్లేస్‌మెంట్ ద్వారా 1,194 మందికి అవకాశం కల్పించినట్లు ఎస్టీ కార్పొరేషన్ గ ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

స్వయం ఉపాధి కింద మూడు ఐటీడీఏలను కలుపుకుని 4,483 మందికి శిక్షణను ఇవ్వగా, ఇంకా 169 మంది శిక్షణను కొనసాగిస్తున్నారు.  ఈ 3 ఐటీడీఏల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ) ద్వారా స్వయం ఉపాధి, శిక్షణ ఇస్తున్నారు. వైటీసీల ద్వారా భద్రాచలంలో మొత్తం 2,967 మందికి, ఏటూరునాగారంలో 2135 మందికి, ఉట్నూరులో అత్యధికంగా 6,672 మందికి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు