ప్లూటోను దాటి.. ఫోన్ చేసింది!

16 Jul, 2015 14:51 IST|Sakshi
ప్లూటోను దాటి.. ఫోన్ చేసింది!

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక మంగళవారం ప్లూటో మరుగుజ్జు గ్రహాన్ని అతిసమీపం నుంచి దాటివెళ్లిన అనంతరం 13 గంటలకు భూమికి ఫోన్ చేసింది! ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్‌కాల్‌ను న్యూ హారిజాన్స్ ప్రసారం చేసిందని బుధవారం నాసా వెల్లడించింది. సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ మంగళవారం ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటి వెళ్లడం, మానవ నిర్మిత మైన ఒక వ్యోమనౌక ప్లూటో సమీపంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం తెలిసిందే.

ఆటోమోడ్‌లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్‌బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. ప్లూటోను సమీపించిన సమయంలో యాంటెన్నాలను ఈ వ్యోమనౌక అటువైపుగా తిప్పుకొన్నందున భూమితో 21 గంటల పాటు సంబంధాలు తెగిపోయి ఉత్కంఠకు గురిచేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కూపర్‌బెల్ట్‌లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోందని, ఆ సమాచారమంతా భూమికి పంపేందుకు 16 నెలలు పడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు