మూడో పెళ్లి చేసుకోవాలనుంది: మాజీ క్రికెటర్

11 Jul, 2016 15:26 IST|Sakshi
మూడో పెళ్లి చేసుకోవాలనుంది: మాజీ క్రికెటర్

ఇస్లామాబాద్: 'నాకు తెలిసి ఎవరి జీవితంలోనైనా విడాకులు తీసుకోవడం అత్యంత దురదృష్టకర సంఘటన. ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అనుభవంతో ఈ మాట చెబుతున్నా. అయితే నేను రాజీ పడే రకాన్ని కాదు. అందుకే మూడో పెళ్లి చేసుకుని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా' అని లేటు వయసులో ఘాటు కోరికను వెల్లడించారు మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్.

 

ప్రస్తుతం తాను ఒంటరినని, బ్యాచిలర్ లైఫ్ బోర్ కొడుతున్నదని ఆయన చెప్పారు. 40 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో విడిపోవడం, గతేడాది జనవరిలో రెండో పెళ్లి.. అది కూడా పెటాకులైన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారాయన. గత వారం ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంపై పెదవి విప్పారు.

'క్రికెట్ లో మంచి ఊపు మీదున్నప్పుడే మా వాళ్లు పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేశారు. కానీ ఒక పని అనుకుంటే నా లక్ష్యమంతా దానిమీదే ఉంటుంది. అప్పట్లో క్రికెటే నా ప్రాణం. అందుకే క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాకే జెమీనాను పెళ్లాడా. పదకొండేళ్ల మా అనుబంధానికి తీపి గుర్తులు ఇద్దరు పిల్లలు. ఎప్పుడైతే నా లక్ష్యం దేశంపైకి.. అంటే రాజకీయాలవైపు మళ్లిందో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జెమీనా పాకిస్థాన్ లో ఉండలేని.. నేనేమో పాకిస్థాన్ తప్ప మరో చోట ఉడలేని పరిస్థితి. దీంతో క్రమంగా ఇద్దరి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. విడిపోక తప్పలేదు. మొదటి వివాహం రద్దయిన తర్వాత దాదాపు 10 ఏళ్లు నేను ఒంటరిగానే ఉన్నా. అందుకు బలమైన కారణం ఉంది. (చదవండి: ఇమ్రాన్‌ హత్యకు రెండో భార్య కుట్ర?)

విడాకులు.. పిల్లలపై తీవ్ర ప్రభావాలు..
నేనూ, జెమీనా విడిపోయినప్పుడు మా పిల్లలకు 9, 11 ఏళ్లు. తల్లిదండ్రులు విడిపోయారనే దానికంటే వాళ్లు వేరొకిరిని పెళ్లి చేసుకున్నారనే భావన పిల్లలల్లో కలిగితే కుంగిపోతారని నా స్నేహితుడైన మానసిక వైద్యుడొకరు చెప్పారు. అందుకే ఆమెతో విడిపోయిన 10 ఏళ్ల వరకూ నేను రెండో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఒంటరిగా ఉంటూ నేను పడే బాధను అర్థం చేసుకుంటారనే ఉద్దేశం కలగగానే.. గతేడాది(2015లో) రెహమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నా. మనం ఒకటి తలిస్తే అల్లా ఒకటి చేస్తాడు. రేహమ్ నేను 10 నెలలకే విడిపోయాం. మళ్లీ నా వ్యక్తిగత జీవితాన్ని ఒంటితనం ఆవహించింది. (చదవండి:  చపాతీలు చెయ్యమన్నాడని..)

ఎన్ని కష్టాలు ఎదురైనా, నిలబడి పోరాడాలనే నేను కోరుకుంటా. రాజకీయాల్లోనూ అంతే. పార్టీ పెట్టిన మొదట్లో ఎన్నెన్నో సందేహాలు, సవాళ్లు. ఇప్పుడు నా పార్టీ నిలబడింది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామనే నమ్మకం ఉంది. అలాగే పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండేందుకు మూడో పెళ్లి చేసుకోవాలనుకుటున్నా. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. అన్ని విధాలా తగిన మహిళ దొరుకుతుందన్న ఆశ లేదు. కానీ నేను దేవుణ్ని అమితంగా నమ్ముతా. ఆయన ప్రణాలిక ఎలా ఉందోమరి!' అంటూ కోరికను వెల్లడించారు ఇమ్రాన్ ఖాన్.

>
మరిన్ని వార్తలు