సర్కారుపై సమర శంఖం

30 Sep, 2015 04:29 IST|Sakshi
సర్కారుపై సమర శంఖం

- పొగాకు రైతులకు జగన్ అండ  
- నేడు టంగుటూరులో నిరసన

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం పొగాకు రైతుల పాలిట శాపంగా మారుతోంది. పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో రైతాంగం ఊపిరి ఆగిపోతోంది. బోర్డు నిర్దేశించిన మేరకే పండించినా కొనే దిక్కు లేక ఉరికొయ్యలను, పురుగు మందులను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుగురు పొగాకు రైతులు కన్ను మూసినా పాలకులు కళ్లు తెరవడం లేదు.
 
మరో ‘టంగుటూరు ఉద్యమం’

రాష్ట్రంలో పొగాకుకు మద్దతు ధర దక్కడం లేదు. తక్కువ రకం(లో-గ్రేడ్) పొగాకును కిలోకు రూ.60 నుంచి రూ.67 మధ్య చెల్లించి, పూర్తిగా కొనుగోలు చేయిస్తామని, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కేంద్రం రూ.15, రాష్ట్రం రూ.5 అదనంగా ఇస్తాయంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నీటి మీద రాతగానే మిగిలిపోయింది. తక్కువ రకం పొగాకు ధర కిలోకు రూ.35 నుంచి రూ.40 మధ్యే పలుకుతోంది. రైతుల వద్దనున్న పూర్తి పొగాకును కొనుగోలు చేయిస్తామన్న హామీ నెరవేరలేదు. అన్ని విధాలా చితికిపోతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తున్నారు.

రైతుల వద్ద ఉన్న లో-గ్రేడ్ సహా అన్ని రకాల పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో నిరసన చేపట్టనున్నారు. రైతాంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుపై భరోసా కల్పించాలని జగన్ సంకల్పించారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిస్తున్నారు. 1983లో పొగాకు వ్యాపారుల మోసాన్ని ఎదిరించి వేలం కేంద్రాల ఏర్పాటుకు రైతులు ‘టంగుటూరు ఉద్యమం’ నడిపారు. అదే ప్రాం తంలో జగన్ మరో పోరాటం చేయనున్నారు.
 
రైతుల కుటుంబాలకు నేడుపరామర్శ  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ నిర్వాకం కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించనున్నారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బొలినేని కృష్ణారావు, నీలం వెంకట్రావ్ కుటుంబాలతోపాటు పొగాకు వేలం కేంద్రం లోనే గుండె ఆగి మరణించిన మిడసల కొండలరావు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం బాధిత రైతుల సమస్యలపై టంగుటూరులో నిరాహార దీక్ష చేపడతారు.
 
పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పామాయిల్, పొగాకు రైతులు మంగళవారం జగన్‌ను కలసి,  సమస్యలను వివరించారు. రైతుల సమస్యలను విన్న జగన్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో జగన్‌ను రైతులు కలిశారు.

మరిన్ని వార్తలు