చిచ్చు రేపిన ఎర్రబస్సు

4 Jun, 2017 10:54 IST|Sakshi
చిచ్చు రేపిన ఎర్రబస్సు

- డ్రైవర్‌, కండక్టర్లపై దేశద్రోహం కేసులు నమోదు
‘జై మహారాష్ట్ర’ నినాదంతో బెల్గాంకు ఎంఎస్‌ ఆర్టీసీ బస్సు
- కర్ణాటక సర్కారు ఆగ్రహం.. తీవ్ర చర్యలకు ఆదేశం
- డ్రైవర్‌, కండక్టర్‌ సహా 16 మందిపై తీవ్ర అభియోగాలు
- ‘బెల్గం విభజన’పై ఇరురాష్ట్రల మధ్య ఉద్రిక్తత


బెల్గాం/ముంబై:
‘ఎర్రబస్సు’  రాజేసిన చిచ్చు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్తతకు దారితీసింది. ‘జై మహారాష్ట్ర’  అనే నినాదం రాసిఉన్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును కర్ణాటక పోలీసులు బెల్గాంలో అడ్డుకున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌లతోపాటు బస్సుకు స్వాగతం పలికిన ‘మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి’  కార్యకర్తలను అరెస్ట్‌చేసిన కర్ణాటక పోలీసులు.. వారిపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదుచేశారు.

శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై శివసేన ఘాటుగా స్పందించింది. కర్ణాటక ప్రభుత్వానిది మతితప్పిన చర్యగా అభివర్ణించింది. ఇటు కర్ణాటక మంత్రి రోషన్‌ బేగ్‌.. కన్నడ గడ్డపై మరాఠా అనుకూల నినాదాలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు.

ఏమిటీ వివాదం?: మహారాష్ట్ర సరిహద్దులోని బెల్గాం జిల్లాలో అత్యధికులు మరాఠీనే మాట్లాడతారు. కర్ణాటకలోని ఈ జిల్లాను విభజించి మహారాష్ట్రలో కలపాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. అయితే ఆ డిమాండ్‌కు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ- శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వివాదానికి మళ్లీ జీవంపోశారు. ముంబై నుంచి బెల్గాంకు వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులపై ‘జై మహారాష్ట్ర’ నినాదాలు రాయించారు. ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇటు బెల్గాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి’ సంస్థ.. ‘జై మహారాష్ట్ర’ బస్సులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. బస్సు కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని 16 మందిపై దేశద్రోహం కేసులు నమోదుచేశారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి: సరిహద్దులోని బెల్గాం జిల్లాను మహారాష్ట్రలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శివసేన పార్టీ ప్రతినిధి నీలమ్‌ గోర్హే డిమాండ్‌ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్‌, కండక్టర్లపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని ఆమె కర్ణాటకపై మండిపడ్డారు. వివాదాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తక్షణమే బెల్గాం ప్రాంతంలో పర్యటించాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా కోరింది.

మహారాష్ట్రకు జై కొడితే చర్యలు: బెల్గాం సహా సరిహద్దులోని ఏ జిల్లాలోనైనా ‘జై మహారాష్ట్ర’ నినాదాలు చేసేవారిని ఉపేక్షించబోమని కర్ణాటక మంత్రి రోషన్‌ బేగ్‌ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుకానీ, ప్రభుత్వాధికారులుకానీ నినాదాలు చేసినట్లైతే పదవులు, ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని బేగ్‌ అన్నారు. ఈ మేరకు కఠిన చట్టం ఒకటి రూపొందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు