ఇద్దరు వివాహితలు లేచిపోయి..

6 Jul, 2016 19:40 IST|Sakshi
ఇద్దరు వివాహితలు లేచిపోయి..

జైపూర్: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడ్డారు. తాము కలసి ఉండేందుకు భర్తలతో పాటు కన్న బిడ్డలను కాదనుకున్నారు. ఎన్నో మలుపులు, ట్విస్ట్లతో ఉన్న ఈ  కథతో ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికి కావల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే.. సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేకాకుండా ఆ వివాహితలకు చెరో సంతానం కూడా ఉంది.  వారి భర్తలు రోజువారి పనిలో భాగంగా విధులకు వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఒకరిని ఒకరూ బాగా అర్థం చేసుకున్నారో లేక అభిప్రాయాలే నచ్చాయో తెలియదు కానీ వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని  దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు వివాహితలు తమ తమ కుటుంబాలను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు.

మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం...సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుగొన్నాడు. వారి దగ్గరికి వెళ్లి మీ వివాహనికి ఇరు కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మించి, ఇంటికి రావాల్సిందిగా కోరాడు. వారు స్వగ్రామానికి తిరిగి రాగానే మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. సోనియా వెళ్లిన తర్వాత మమతా కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది.

తన భాగస్వామి మమత  జాడ కోసం సానియా అన్ని ప్రాంతాల్లో వెతుకుతూనే ఉంది. తామున్న చోటు ఎవరికీ తెలియకుండా ఉండటానికి మమత కుటుంబ సభ్యులు ఇంటిని కూడా వదిలి పోవడంతో.. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది.

కోర్టు మమత కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని సోనియా కన్నీటి పర్యంతమవుతోంది.

మరిన్ని వార్తలు