సంస్కరణలు.. చకచకా

19 Jun, 2015 04:30 IST|Sakshi
సంస్కరణలు.. చకచకా

♦ గ్లోబల్ ఇన్వెస్టర్లకు జైట్లీ హామీ
♦ 7.5 శాతం కన్నా అధిక వృద్ధి సాధ్యమేనని ధీమా
♦ 10 రోజుల అమెరికా పర్యటన ప్రారంభం
 
 న్యూయార్క్ : దేశంలో సంస్కరణల ప్రక్రియను మోదీ ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. భారత్‌కు 7.5 శాతం కన్నా అధికంగా మంచి ఆర్థికవృద్ధి రేటును సాధించే సత్తా ఉందని పేర్కొంటూ... పెట్టుబడులకు దేశం అత్యుత్తమమైన ప్రాంతమని తెలిపారు. 10 రోజుల అమెరికా పర్యటనను బుధవారం ప్రారంభించిన జైట్లీ, దేశానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశాలు జరుపుతున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని సందర్శించారు. భారత్‌లో స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ముగిసి, స్థిరత్వం నెలకొంటుందని అన్నారు. పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాల్లో కొన్ని....

► భారత్‌లో గత ఏడాదిగా సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాం. ఈ ప్రక్రియ మున్ముం దు మరింత క్రియాశీలకంగా కొనసాగుతుంది.
► భారత్ పన్నుల వ్యవస్థ సంస్కరణలపై సైతం కేంద్రం దృష్టి సారించింది.  ముఖ్యంగా గత ఎంతో కాలంగా సమస్యాత్మకంగా ఉన్న పన్నుల చట్ట సంస్కరణలకు కేంద్రం కట్టుబడి ఉంది. వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) మొత్తం పరోక్ష పన్నుల వ్యవస్థను సమూలంగా ప్రయోజనాత్మకంగా మార్చడానికి దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను పరమైన అడ్డంకుల్లేకుండా ప్రభుత్వం తగిన చొరవలు తీసుకుంటోంది.
► కార్పొరేట్ పన్నులను అంతర్జాతీయ పోటీ పూర్వక స్థాయిలో రానున్న నాలుగేళ్లలో 25% స్థాయికి తీసుకువెళతామని బడ్జెట్‌లో పేర్కొన్నాం.
► భారత్‌లో భారీ పెట్టుబడుల ద్వారా వృద్ధి ప్రక్రియలో మాకు సహకరించాలని కోరడానికి నేను అమెరికాకు వచ్చాను. వృద్ధి ద్వారా దేశంలో పేదరిక నిర్మూలన మా లక్ష్యం. అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచీ చక్కటి ప్రతిస్పందన ఉంది. గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 39 శాతం పెరగడం సానుకూల అంశం.
► రానున్న సంవత్సరాల్లో 7.5 శాతంకన్నా అధిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా. భవిష్యత్తులో మరింత వృద్ధి ప్రభుత్వ ధ్యేయం. కొత్త జీడీపీ గణాంకాలు విశ్వసనీయమైనవే.
► పెట్టుబడులకు సంబంధించి భారత్-చైనాలను ఒకదానితో ఒకటి పోల్చలేం. ఇటీవలే మేము మంచి వృద్ధి రేటును సాధించాం. అయితే చైనా మూడు దశాబ్దాలకు పైగా 9 శాతంపైన వృద్ధిని నమోదుచేసుకుంది. చైనా తరహాలో వృద్ధి రేటును సాధించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం.
► అమెరికా వడ్డీరేట్లు పెంచినా... ఆ ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయిలోనే భారత్ ఉంది.
 
 ‘లలిత్ మోదీ’పై నో కామెంట్..
 న్యూయార్క్ పర్యటన సందర్భంగా అరుణ్‌జైట్లీ వద్ద కొందరు విలేకరులు మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీకి సంబంధించి నెలకొన్న వివాదం గురించి ప్రస్తావించారు. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

 జైట్లీ వెంట సీఐఐ బృందం...
 అమెరికాలో జై ట్లీ పర్యటనలో పారిశ్రామిక సంస్థ- సీఐఐ వాణిజ్య ప్రతినిధి బృందం పాల్గొంటోంది. ఈ బృందానికి ప్రెసిడెంట్ డిజిగ్నేట్ నౌషాద్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా కార్పొరేట్లు, పెన్షన్ ఫండ్లు, వ్యవస్థాగత ఇన్వెస్టర్లసహా గ్లోబల్ ఇన్వెస్టర్లతో పలు ఈవెం ట్లను సీఐఐ నిర్వహిస్తోంది. అమెరికా నుంచి భారత్‌కు దీర్ఘకాలికంగా భారీ పెట్టుబడులు లక్ష్యంగా సీఐఐ చొరవలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు