ఎంట్రెన్స్‌ పరీక్షలపై బడ్జెట్‌లో సంచలన ప్రతిపాదన

1 Feb, 2017 12:39 IST|Sakshi
ఎంట్రెన్స్‌ పరీక్షలపై బడ్జెట్‌లో సంచలన ప్రతిపాదన

దేశమంతటా పరీక్షల నిర్వహణకు ఎన్టీఎస్‌ ఏర్పాటు

దేశమంతటా ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఎన్టీఎస్‌)ను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను సీబీఎస్‌ఈ, ఐఐటీలు, ఏఐసీటీఈ వంటి విభిన్న సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఎస్‌ పేరిట ఏర్పాటుచేస్తున్న నోడల్‌ ఏజెన్సీకి ఇక నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల బాధ్యతలను అప్పగించనున్నారు.

సీబీఎస్‌ఈ, ఐఐటీలు,ఐఐఎంలు, ఏఐసీటీఈ వంటి సంస్థలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న క్యాట్‌​, జేఈఈ (మెయిన్‌), జేఈఈ (అడ్వాన్స్‌డ్‌), గేట్‌, సీఎంఏటీ, నీట్‌, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు 40లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు.

ఇక విద్యాసంస్థలకు మరింత స్వతంత్రత (అటానమీ) ఇచ్చేందుకు యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ)ని పునర్వ్యవస్థీకరిస్తామని బడ్జెట్‌ లో జైట్లీ స్పష్టం చేశారు. దీనివల్ల ఎంచుకున్న కాలేజీలకు అటానమీ హోదా లభించనుంది. అదేవిధంగా ఫలితాల ఆధారంగా విద్యాసంస్థలకు అక్రిడిటేషన్‌ (గుర్తింపు) ఇవ్వబోతున్నామని జైట్లీ వెల్లడించారు. విద్యారంగం అంశాన్ని ప్రస్తావిస్తూ.. స్వామి వివేకానంద సూక్తిని ఉటంకించిన జైట్లీ.. ‘నాణ్యమైన విద్యే యువతకు శక్తిని ఇస్తుందని’ పేర్కొన్నారు.


 

>
మరిన్ని వార్తలు