ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు

21 Jan, 2017 10:21 IST|Sakshi
జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నై మెరీనా బీచ్‌లో ప్రదర్శనకారులు వెనక్కి వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు మానలేదు. అంతా ఓకే అనుకున్నా కూడా ఎందుకలా జరుగుతోంది? వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాలామందికి అనుమానాలున్నాయి. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటి తుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  (చదవండి: ఆట కోసం ఆర్డినెన్స్)
 
అందుకే.. ఆర్డినెన్సు కాపీ తమకు చూపించడంతో పాటు.. రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తర్వాత మాత్రమే తాము ఇక్కడినుంచి కదిలి వెళ్తామని మెరీనా బీచ్‌లో గత ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువత చెబుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో శనివారం నాడు ఒక్కరోజు నిరాహార దీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పార్టీ అగ్రనేతలు ఎంకే స్టాలిన్, కనిమొళి కూడా స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం నిర్వహించిన రైల్ రోకోలో కూడా వీళ్లిద్దరూ పాల్గొన్నారు.