అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా?

19 Jan, 2017 08:18 IST|Sakshi


జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో భారీ ఎత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ మొత్తం ప్రదర్శనకారులతో నిండిపోయింది. ఎవరు పిలుపునిచ్చారో తెలియదు, ఎలా వచ్చారో అర్థం కాలేదు గానీ.. వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. వాళ్లలో ఎక్కువ మంది యువకులు, విద్యావంతులు, యువ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేవు గానీ, నిరసనలు మిన్నంటాయి. ప్రశాంతంగా తమ నిరసన తెలియజేసి, జల్లికట్టుకు అనుమతులు ఇవ్వాలని గళం వినిపించారు. అప్పటివరకు బీచ్ వదిలి వెళ్లేది లేదంటూ రాత్రంతా కూడా అక్కడే పడుకున్నారు. 
 
అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలూ జల్లికట్టుకు మద్దతు తెలిపాయి. కానీ ఏ ఒక్కరూ ఈ నిరసనలకు పిలుపు ఇవ్వలేదు, వాటిని స్పాన్సర్ చేయలేదు. విద్యార్థులు, నటీనటులు, క్రికెటర్లు, కొంతమంది సెలబ్రిటీలు ప్రధానంగా దీనికి మద్దతిచ్చారు. ఇదంతా కూడా సోషల్ మీడియా పుణ్యమే. ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా తమిళ సంస్కృతి అయిన జల్లికట్టును కాపాడుకోవాలంటూ ఇచ్చిన పిలుపు విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. ఈ నిరసనలు కొనసాగుతూనే ఉండే సూచనలు కనిపించడంతో చెన్నైలోని 31 కాలేజీలు ఏకంగా సెలవులు ప్రకటించేశాయి.

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]

ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తేవాలని కోరనున్నారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళ కూడా అదేమాట చెప్పారు. పెటా మీద నిషేధం విధిస్తామని కూడా ఆమె అన్నారు. ఇతర పార్టీల వాళ్లు కూడా తప్పనిసరిగా దీనికి మద్దతు చెప్పాల్సి వచ్చింది. 
 
చెన్నైకి చెందిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్విట్టర్‌లో జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని చెప్పాడు. ప్రముఖ హీరో విజయ్ కూడా ఒక వీడియో సందేశం పోస్ట్ చేశాడు. ప్రజల సంప్రదాయాలు, వాళ్ల హక్కులను దోచుకోడానికి చట్టాన్ని తయారు చేయలేదని, జల్లికట్టు అనేది ప్రతి ఒక్క తమిళుడి గుర్తింపని చెప్పాడు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవాళ్లంతా తాము తమిళులమనే వచ్చారు తప్ప రాజకీయ ఒత్తిడితో కాదన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు చెప్పారు. తమిళులు ఎద్దులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారని, వాటిని హింసించరని తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు మాత్రం.. ఈ నిరసనల వల్ల ఈ అంశంపై కోర్టులో కొనసాగుతున్న విచారణ మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.