దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

28 Aug, 2013 10:59 IST|Sakshi
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

న్యూఢిల్లీ : శ్రావణ బహుళ అష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి ఆలయాలన్నీ శ్రీకృష్ణ నామంతో మార్మోగాయి.  శ్రీకృష్ణుడి జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భక్తజన సంద్రం ఉప్పొంగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పాలు, పెరుగు, వెన్నతో చిన్నికృష్ణయ్యకు భక్తులు అభిషేకం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది గురువారం కృష్ణాష్టమి జరుపుకోనున్నారు.

అష్ట అంటే ఎనిమిది. ఈ అంకెతో శ్రీ కృష్ణుడికి చాలా సంబంధం ఉంది. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం ఆయనది. ఓం నమో నారాయణా య.. అని శ్రీకృష్ణుడిని ధ్యానిస్తారు. ఇది ఎనిమిది అక్షరాల మంత్రం కావడం విశేషం. దేవకీదేవికి శ్రీకృష్ణుడు ఎనిమిదవ సంతానం. ఆయనకు ఎనిమిది మంది ధర్మపత్నులున్నారు. శ్రీకృష్ణభగవానుడు దేవకీ గర్భం నుంచి ఉదయించిన పవిత్రదినాన్ని శ్రీ కృష్ణ జ న్మాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. కృష్ణాష్టమి రోజు జనులు అభ్యంగ స్నానమారించి, నూతన వస్త్రాలు ధరించి ఉపాసనం సంకల్పిస్తారు.

తమ ఇళ్లను తోరణాలతో అలంకరించి, ఇళ్ల ముంగిళ్లలో బాలకృష్ణడి పాదముద్రలను బయటి నుంచి ఇంటిలో ఉన్న దేవిని గృహం వరకు వేయడం వల్ల బాలకృష్ణుడు బుడిబుడి అడుగులతో తమ గృహాలను విచ్చేస్తాని విశ్వాసం. చెలిమికి, ప్రేమకు, దుష్టశిక్షణకు శ్రీకష్ణుడు ప్రతీక. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా  ఇస్కాన్ దేవాలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. 

ఢిల్లీ, ముంబై, లక్నో, ఛండీగఢ్, కోల్‌కతా, జమ్మూ, హర్యానా, హైదరాబాద్.. తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు.  ఢిల్లీ ఇస్కాన్‌ మందిరంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. భజనలు చేస్తూ తన్మయులయ్యారు.  
 

మరిన్ని వార్తలు