సమస్యలు పరిష్కరించేది జనార్దనే

10 Jul, 2015 02:19 IST|Sakshi
సమస్యలు పరిష్కరించేది జనార్దనే

జనార్దన్ టీడీపీ కార్యాలయ ఇన్‌చార్జి: సెబాస్టియన్
మా సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించేది అతనే

 
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్ ఎవరనే విషయాన్ని ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న బిషప్ సెబాస్టియన్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యతలు నిర్వహించే టీడీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లే అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్తాయన్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయటకొచ్చిన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి సంతకం చేయడానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీడీపీ కార్యాలయ ఇన్‌చార్జి టీడీ జనార్దన్‌తోనే ప్రస్తావిస్తాం. సీఎం చంద్రబాబును నేరుగా కలిసే అవకాశం మాకు దొరకదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా బిజీగా ఉంటారు. కనుక మా సమస్యలను జనార్దన్‌తో చెప్పుకుంటాం.

ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబు వద్ద ఆ సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తారు’ అని సెబాస్టియన్ పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయస్థానానికి ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్ అనే వ్యక్తి ఎవ రని విలేకరులు ప్రశ్నించగా సెబాస్టియన్ పైవిధంగా స్పందించారు. అయితే ఈ కేసుతో జనార్దన్‌కు ఏలాంటి సంబంధం లేదన్నారు. ఏసీబీ కావాలనే తమను కుట్రపూరితంగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించిందన్నారు. తమ ఫోన్లను ఏసీబీ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. తన ఫోన్‌లో ఎలాంటి సంభాషణలూ రికార్డు కాలేదని, అవన్నీ ఏసీబీ సృష్టిస్తున్న కట్టుకథలని సెబాస్టియన్ చెప్పుకొచ్చారు.
 

మరిన్ని వార్తలు