జయేంద్ర సరస్వతి నిర్దోషి

28 Nov, 2013 04:03 IST|Sakshi
జయేంద్ర సరస్వతి నిర్దోషి

సాక్షి, చెన్నై:  తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన శంకరరామన్ హత్య కేసు నుంచి కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసులో వీరితోపాటు మిగతా 21 మంది నిందితులను పుదుచ్చేరిలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బుధవారమిక్కడి సెషన్స్ కోర్టు జడ్జి సీఎస్ మురుగన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు చూపించనందున మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జడ్జి తెలిపారు. చార్జిషీటులో పేర్కొన్న అభియోగాలను నిరూపించడంలో పోలీసులు విఫలమైనందున సంశయ లబ్ధి (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిందితులను విడిచిపెడుతూ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
  2004, సెప్టెంబర్ 3న కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ గుడి ప్రాంగణంలోనే హత్యకు గురి కావడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక కంచి పీఠాధిపతి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అదే ఏడాది దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మొత్తం 24 మంది నిందితులు ఉండగా వారిలో కదివరన్ అనే వ్యక్తి ఈ ఏడాది చెన్నైలో అనూహ్య పరిస్థితుల మధ్య హత్యకు గురయ్యారు. 2004 నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరికి ఎవ రూ దోషులుగా తేలకపోవడం గమనార్హం. కోర్టు తీర్పుపై శంకరరామన్ కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుపై అప్పీలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు శంకరరామన్ తనయుడు ఆనంద్ శర్మ తెలిపారు.
 
  ఎవరూ దోషులు కాకుంటే తన తండ్రిని ఎవరు చంపినట్టు అని ఆయన ప్రశ్నించారు. జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. కంచి మఠం సిబ్బంది, భక్తులు, నిందితుల బంధుగణం, జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతితోపాటు నిందితులంతా కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు అనంతరం ఏమీ మాట్లాడకుండానేనే కంచి స్వాములు.. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతికి కారులో బయల్దేరి వెళ్లారు.
 
 దర్యాప్తు సరిగ్గా సాగలేదు..
 ఉదయం 10.50 గంటలకు జడ్జి మురుగన్ కేసు విచారణను ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించారు. శంకరరామన్ హత్య కేసులో దర్యాప్తు ఆసాంతం సరైన మార్గంలో సాగలేదని ఆయన స్పష్టంచేశారు. కేసు దర్యాప్తులో అప్పటి కాంచీపురం ఎస్పీ ప్రేమ్‌కుమార్  అత్యుత్సాహం ప్రదర్శించారని తప్పుపట్టారు. జయేంద్ర సరస్వతికి బెయిల్ మం జూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రేమ్‌కుమార్ మితిమీరిన జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు గతి తప్పిందని, కేసు దర్యాప్తు ప్రధాన అధికారి(సీఐవో) స్వతంత్రంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. హత్య అని నిరూపించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, అంతేగాక శంకరరామన్ భార్య పద్మ, కుమారుడు ఆనంద్‌శర్మ ప్రాసిక్యూషన్‌ను బలపరిచే విధంగా వ్యవహరించలేదన్నారు.
 
 హత్య కేసులో ప్రధాన కుట్రదారులుగా అభియోగాన్ని ఎదుర్కొన్న అప్పు, కదిరవన్ (ఆ తర్వాత హత్యకు గురయ్యాడు)లు తాము ఆ సమయంలో సంఘటన ప్రదేశంలో లేమని నిరూపించుకున్నారని వివరించారు. ఫిర్యాది గణేశన్‌తోపాటు కుప్పుస్వామి, దురైకన్ను తదితర సాక్షులు సైతం ప్రాసిక్యూషన్ వాదనను బలపరిచేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించడంలో శంకరరామన్ కుటుంబీకులు విఫలమయ్యారన్నారు. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు నిందితుల నేరాన్ని రుజువు చేయలేకపోయాయని చెప్పారు. దర్యాప్తు అధికారులు సాక్షులను బెదిరించి సంతకాలు తీసుకోవడం, కన్నయ్య అనే ఎస్సైని బెదిరించి విధులకు దూరంగా ఉంచడం వంటి తప్పిదాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఏ కోణంలో చూసినా నిందితులపై మోపిన అభియోగాలపై బలమైన సాక్ష్యాలు లేవని తెలిపారు. అందువల్ల వారిని నిర్దోషులుగా భావిస్తున్నట్లు చెప్పారు.
 
 కేసు నేపథ్యం ఇదీ..
 కంచి మంఠంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ ఆ మఠం ఆధీనంలో ఉన్న శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు. ఈ నేపథ్యంలో 2004లో ఆయన ఆలయ ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా పలువురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు జయేంద్ర సరస్వతి 61 రోజులపాటు జైలు జీవితం గడిపారు. పోలీసులు మొత్తం 1873 పేజీల చార్జిషీటును దాఖలు చేసి 712 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. 370 మందిని సాక్షులుగా చేర్చారు. వీరిలో 187 మందిని కోర్టు విచారించింది.
 
  ఎప్పుడేం జరిగింది?
     2004, సెప్టెంబర్ 3: కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్                హత్య
     2004, నవంబర్ 11: దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతి అరెస్టు
     నవంబర్ 12: జయేంద్ర సరస్వతికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు
     2005, జనవరి 10: జయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విజయేంద్ర సరస్వతి అరెస్టు
     జనవరి 21: నిందితులపై చార్జిషీటు దాఖలు చేసిన తమిళనాడు సిట్ పోలీసులు
     ఫిబ్రవరి 10: విజయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు
     మార్చి 6: కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలంటూ జయేంద్ర సరస్వతి పిటిషన్.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
     అక్టోబర్ 26: శంకరరామన్ హత్య కేసుపై విచారణను పుదుచ్చేరిలోని కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం
     2006, మార్చి 28: 24 మంది నిందితులపై అభియోగాలు నమోదు
     2009, ఏప్రిల్ 2: పుదుచ్చేరిలోని ప్రధాన సెషన్స్ కోర్టులో విచారణ మొదలు
     2010, జనవరి 21: కోర్టులో రవి సుబ్రహ్మణ్యం ఎదురు సాక్ష్యం
     2013, మార్చి 21: కేసులో నిందితుడు కదిరవన్ చెన్నైలో హత్య. 23కు చేరిన నిందితుల సంఖ్య
     నవంబర్ 12: నవంబర్ 27న తీర్పు వెలువరించనున్నట్లు పుదుచ్చేరి లోని కోర్టు వెల్లడి
     నవంబర్ 27: జయేంద్ర సరస్వతితోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన కోర్టు

మరిన్ని వార్తలు