జేఈఈలో అమ్మాయిల వెనుకంజ

20 Jun, 2014 01:10 IST|Sakshi

టాప్-100లో ఐదుగురే  
అర్హత సాధించిన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 11శాతమే
రాజస్థాన్ విద్యార్థి చిత్రాంగ్ ముర్దియాకు టాప్ ర్యాంకు
బాలికల్లో అదితికి తొలి స్థానం
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా 27,151 మందికి అర్హత
 
 కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్) ఫలితాలు గురువారం విడుదల య్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన తొలి వంద మంది విద్యార్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే బాలికలు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణుల్లో అమ్మాయిలు 11 శాతం మాత్రమేనని జేఈఈ ఇన్‌చార్జి, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎం.కె.పాణిగ్రాహి వెల్లడించారు. జేఈఈ(అడ్వాన్స్‌డ్)లో రాజస్థాన్‌కు చెందిన చిత్రాంగ్ ముర్దియా 360 మార్కులకు గాను 334 మార్కులు సాధించి టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు. బాలికల్లో టాపర్‌గా నిలిచిన ఐఐటీ రూర్కీ జోన్‌కు చెందిన అదితి.. కామన్ మెరిట్ లిస్ట్ (సీఎంఎల్)లో ఏడో ర్యాంకు సాధించింది.
 
 ఈ పరీక్ష కు దేశవ్యాప్తంగా మొత్తం 1,26,997 మంది నమోదు చేసుకోగా.. 27,151 మంది అర్హత సాధించినట్టు పాణిగ్రాహి తెలిపారు.మొత్తమ్మీద కామన్ మెరిట్ లిస్ట్‌లో 19,416 మంది ఉండగా.. 6వేల మంది ఓబీసీ, 4,400 మంది ఎస్సీ, 1,250 మంది ఎస్టీ మెరిట్ జాబితాల్లో ఉన్నారు. 243 మంది వికలాంగులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీఎంఎల్‌లో దాదాపు 3,500 మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అంతేకాకుండా అన్ని కేటగిరీ ల్లోనూ అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. జేఈఈ (అడ్వాన్స్‌డ్)లో విజయం సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 16 ఐఐటీలతోపాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ప్రవేశాలు పొందడానికి అర్హులవుతారు.
 
 సత్తా చాటిన ‘సూపర్ 30’
 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 27మందికి అర్హత
 
 పాట్నా: ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్‌డ్)లో ‘సూపర్-30’ సంస్థ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రతి ఏటా 30 మంది అత్యంత పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఈ సంస్థ నుంచి ఈసారి 27 మంది అర్హత సాధించడం విశేషం. వీరిలో రోజు కూలీ, చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు పక్కన తినుబండారాలు విక్రయించుకునే వారి పిల్లలు ఉన్నారు. పేదరికం కారణంగా ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లలేకపోయిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి.. పేద విద్యార్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపిం చారు. 2001లో ప్రారంభమైన సూపర్-30 నుంచి ఇప్పటివరకు 360 మంది విద్యార్థులు ఐఐటీ-జేఈఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో 308మంది అర్హత సాధించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
 
 పరిశోధకుడిని కావాలనుకుంటున్నా
 ‘‘ఇది ఎంతో ఆనందకరమైన రోజు. ఈ విజయానికి కారణం.. నా తల్లిదండ్రులు, కోటాస్ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులే. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాకు  కార్పొరేట్ ఉద్యోగం కంటే పరిశోధనలంటేనే ఇష్టం. ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధకుడు కావాలనుకుంటున్నా. మనదేశం పరిశోధనల్లో బాగా వెనకబడి ఉంది. పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి పరిశోధనలు ఎంతో కీలకం. అణగారినవర్గాలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవ డం ద్వారా సమాజానికి సేవ చేయాలని ఉంది. ముంబై ఐఐటీలోనే చేరాలనుకుంటున్నా’’
 - చిత్రాంగ్ ముర్దియా, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్‌డ్) టాపర్
 
 అమ్మాయిలకు ప్రోత్సాహం లేదు
 ‘‘ఇంజనీరింగ్ వైపు వెళ్లేలా బాలికలను వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడంలేదు. ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్‌డ్)లో అమ్మాయిలు వెనుకబడటానికి అదే కారణం. నేను ఇంజనీరింగ్ చదివేందుకు నా కుటుంబం పూర్తిగా ప్రోత్సహించింది. కానీ నా స్నేహితుల్లో చాలామంది మెడికల్ లేదా కామర్స్‌ను ఎంచుకున్నారు. ఇంజనీరింగ్‌లో తక్కువ మంది బాలికలు ఉండటానికి అదే కారణం. అంతమాత్రాన అమ్మాయిలు మంచి ఇంజనీర్లు కాలేరని కాదు’’
 - అదితి, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్‌డ్) బాలికల టాపర్

మరిన్ని వార్తలు