శ్రియ కరెక్ట్ కాదు!

14 Sep, 2015 10:11 IST|Sakshi
శ్రియ కరెక్ట్ కాదు!

చెన్నై: దృశ్యం చిత్రంలో కథానాయకి పాత్రకు శ్రియ కరెక్ట్ కాదా..? అదే అంటున్నారు ఆ చిత్ర సృష్టికర్త మలయాళ సినీ దర్శకుడు జీతూ జోసఫ్. ఆయన మలయాళంలో దర్శకత్వం వహించిన చిత్రం దృశ్యం. మోహన్‌లాల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా నటి మీనా నటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకం. ముగ్గురు పిల్లల తల్లిగా పరిణితి చెందిన నటనను ప్రదర్శించి మెప్పించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. వెంకటేశ్ కథానాయకుడు. నాయిక మీనానే. అక్కడా దృశ్యం హిట్.

కన్నడ,తమిళ భాషల్లోనూ పునర్నిర్మాణమై విజయతీరాలను చేరింది. పాపనాశం పేరుతో తమిళంలో విశ్వనాయకుడు కమలహాసన్ నటించారు. ఆయనకు జంటగా నటి గౌతమి నటించారు. సుదీర్ఘ విరామం తరువాత ఆమె రీఎంట్రీ అయిన చిత్రం పాపనాశం. మలయాళం చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్‌నే తమిళ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఇలా దక్షిణాది భాషలన్నిటిలోనూ విజయం సాధించిన దృశ్యం చిత్రాన్ని అదే పేరుతో హిందిలో రీమేక్ చేశారు.అక్కడ కమలహాసన్ పాత్రలో అజయ్ దేవ్‌గన్ నటించారు. ఆయన సరసన నటి శ్రియ నటించారు. హిందీలో నిషీకాంత్ కామత్ దర్శకత్వం వహించారు.

అయితే దక్షిణాది నాలుగు భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం చిత్రం బాలీవుడ్‌లో బోర్లా పడింది. కారణమేమిటన్న విషయాన్ని ఒరిజినల్ దృశ్యం చిత్ర దర్శకుడు జీతు జోసఫ్ వివరిస్తూ కథకు నప్పే నటీనటుల్ని ఎంపిక చేయడం చాలా ముఖ్యం అన్నారు. దృశ్యం చిత్రానికి మలయాళం, కన్నడం, తెలుగు, తమిళం భాషలో రూపొందించినప్పుడు సరైన తారాగణాన్నిఎంపిక చేసినట్లు అన్నారు. అయితే హిందీలో అలా జరగలేదని వ్యాఖ్యానించారు. నటి శ్రియ గురించే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు