జేకే గ్రూప్ చేతికి క్యావెండిష్ ఇండస్ట్రీస్

13 Sep, 2015 00:49 IST|Sakshi

డీల్ విలువ రూ. 2,200 కోట్లు
 
న్యూఢిల్లీ: జేకే గ్రూప్ తాజాగా కేశోరామ్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ క్యావెండిష్ ఇండస్ట్రీస్‌ను(సీఐఎల్) కొనుక్కోనుంది. ఈ డీల్ విలువ రూ. 2,200 కోట్లు. హరిద్వార్‌లోని ప్లాంటులో సీఐఎల్ టైర్లు, ట్యూబులు, ఫ్లాప్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. సీఐఎల్‌లో పూర్తి వాటాల కొనుగోలుకు సంబంధించి కేశోరామ్ ఇండస్ట్రీస్‌తో జేకే గ్రూప్‌లో భాగమైన జేకే టైర్, జేకే ఆసియా పసిఫిక్ సింగపూర్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

కొనుగోలు అనంతరం జేకే టైర్‌కి సీఐఎల్‌లో సింహభాగం వాటాలతో పాటు గణనీయంగా మేనేజ్‌మెంట్ అధికారాలు దఖలుపడతాయి. ట్రక్, బస్సు రేడియల్స్ విభాగంలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని జేకే టైర్ చైర్మన్ రఘుపతి సింఘానియా తెలిపారు. డీల్ మొత్తంలో జేకే టైర్ నికరంగా రూ. 450 కోట్లు సమకూర్చవచ్చని అంచనా. దేశీయంగా టాప్ 3 టైర్ల తయారీ కంపెనీల్లో జేకే టైర్ కూడా ఒకటి.
 

మరిన్ని వార్తలు