స్థిరంగా జెన్‌ఎన్‌యూ విద్యార్థిని రోష్ని ఆరోగ్యం

2 Aug, 2013 20:50 IST|Sakshi
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వద్ద రోషిణి బంధువులు

ప్రేమించలేదనే కసితో సహద్యాయి గొడ్డలి దాడిచేయగా తీవ్రంగా గాయపడిన రోషిణి ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే ఆమె ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతుందని తెలిపారు. జెఎన్‌యూలో కొరియన్ అభ్యసిస్తున్న ఆకాశ్ (23) తన సహ విద్యార్థినిని ప్రేమించమని మూడేళ్లుగా వేధిస్తున్నాడు.

బుధవారంనాడు తరగతి గదిలో పిస్తోల్, గొడ్డలి, కత్తితో ప్రవేశించిన ఆకాశ్ రోషిణి మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించగా పిస్తోల్ పేలలేదు. దాంతో గొడ్డలితో దాడి చేశాడు. రోషిణి తీవ్రంగా గాయపడిన తరువాత నిందితుడు సల్ఫాన్ మాత్రలు మింగడంతో పాటు కత్తితోపాటు గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆకాశ్‌ను ఎయిమ్స్‌కు తరలించగా మరణించాడు.

బాధితురాలు రోషిణిని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ బీడీ అట్టాని మాట్లాడుతూ ‘‘ రోషిణి గాయాలను పరిశీలించాము. గాయాలను శుభ్రపర్చి కట్లు కట్టాము. అవయవాల కదలికలను కూడా పరిశీలించాము. తల మీద కుడి చేతి మీద లోతయిన గాయాలయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టి ఉంది’’ అని వివరించారు.

ముజఫరాబాద్ వ్యాపారి చిన్న కూతురయిన రోషిణి 12వ తరగతి వరకు బీహార్‌లో చదివి ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వచ్చింది. జెఎన్‌యూ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో కొరియన్ అభ్యసిస్తోంది. బుధవారం జరిగిన దాడి నేపథ్యంలో రోషిణి సోదరుడు మాట్లాడుతూ‘‘ఆకాశ్ మా చెల్లిని చాలా రోజులుగా వేధిస్తున్నాడు. ప్రతిసారి అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. చదువుపైనే దృష్టి నిలిపిన తన చెల్లికి గత వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి’’ అని వివరించాడు. ఆకాశ్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన నాలుగు పేజీల లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు