బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ ఎర

15 Sep, 2015 10:55 IST|Sakshi

రూ. 2,500 నుంచి రూ. లక్షకు పైగా వసూలు

హైదారాబాద్:  బడా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకొని మోసం చేస్తున్న  ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ ముఠాకు నగర పోలీసులు చెక్ పెట్టారు.  నోయిడాకు వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రావు కథనం ప్రకారం... ముఖేశ్ మిశ్రా అనే వ్యక్తి  సైన్.కామ్ నుంచి నిరుద్యోగులకు చెందిన మూడు వేల రెస్యూమ్(బయోడేటా)లు రూ. 6 వేలకు కొనుగోలు చేశాడు. ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బల్క్‌గా కొనుగోలు చేశాడు. ఆ రెస్యూమ్‌లను నోయిడాకు చెందిన భగీరత్ త్యాగికి ఇవ్వగా, అందులో కొన్నింటిని ఎంపిక చేసి అతను టెలికాలర్స్‌కు ఇచ్చాడు.   బయోడేటాలోని వివరాల ఆధారంగా టెలికాలర్స్ ఫోన్ చేసి... మేం షైన్.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం...బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్‌జీ ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఉద్యోగాలున్నాయని నమ్మిస్తారు.

ఎవరైనా ఆసక్తి చూపితే రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత 2,500 లు చెల్లించాలంటారు. ఆ తర్వాత ఫోన్‌లో ఇంటర్వ్యూ చేసి మీరు సెలక్ట్ అయ్యారని సమాచారమిస్తారు. ఆఫర్ లెటర్ కోసం రూ.5,600 లు డిపాజిట్ చేయమంటారు. ఆ తర్వాత ఒరిజినల్ కంపెనీల నుంచి వచ్చినట్టుగా అభ్యర్థులు భావించేలా ముఖేశ్ మిశ్రా ఈఎంకేఈఐ.సీజెడ్ నుంచి ఆఫర్ లెటర్‌లు తయారు చేసి పంపిస్తాడు. ఆ తర్వాత శిక్షణ ఫీజు, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చార్జీల కింద రూ.25 వేల వరకు డిపాజిట్ చేయాలని అభ్యర్థులను కోరతాడు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా లక్షకు పైగా చెల్లించారు. కాగా, నగరానికి చెందిన బాధితుడు చటకొండ బాల యోగీశ్వర్ ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

నగర సైబర్ క్రైమ్ పోలీసులు నోయిడా వెళ్లి నిందితులు ముఖేశ్ మిశ్రా, సునీల్ కుమార్ గుప్తా, భగిరత్ త్యాగి, సందీప్ సింగ్‌లను అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.  తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక,  తమిళనాడులకు చెందిన సుమారు 70 మందిని వీరు మోసం చేసినట్టు విచారణలో గుర్తించారు. అయితే ఈ సంఖ్య రెండువేలకు పైగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు