ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో ఉమ్మడి పరిశోధన

2 Sep, 2015 02:53 IST|Sakshi

- అటవీ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం
- మెదక్ జిల్లాలో 40 హెక్టార్లలో పరిశోధన కేంద్రం
సాక్షి, హైదరాబాద్:
అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ గతంలో పట్టాలు జారీ చేసిన భూముల్లో (ఆర్‌ఓఎఫ్‌ఆర్) తిరిగి అటవీ సంపదను వృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదించారు. అటవీ సంపద వృద్ధిపై పరిశోధనకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు మెదక్ జిల్లా ములుగు అటవీ ప్రాంతంలో సుమారు 40 హెక్టార్ల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ‘ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టు’ పేరిట అటవీ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి పీకేశర్మ సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. అంతగా సారవంతం లేని ఈ భూములకు నీటిపారుదల సౌకర్యం లేకపోవడం, పంట ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో అటవీ సంపదనే వృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది.  

అటవీ భూములపై హక్కులు ఉన్న వ్యక్తులు, సమూహాలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ భూములపై ఆధా రపడి వున్న షెడ్యూలు తెగలతో పాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2006లో ప్రత్యేక చట్టం రూపొందించారు. 2008 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా 96,238 మందికి (3,13,912 ఎకరాలు), 744 సమూహాల (5,30,082 ఎకరాలు)కు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ప్రస్తుతం సీఎం ఆమోదించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం ఈ భూముల్లో అట వీశాఖ సహకారంతో ఉద్యానవన శాఖ... అటవీ జాతులు, ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుపై పరిశోధనలు నిర్వహిస్తుంది. తద్వారా అటవీ భూములపై ఆధారపడి సాగు చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శులు కె.భూపాల్‌రెడ్డి, ప్రియాంక వ ర్గీస్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు