లోఫర్ అంటే తప్పా?

25 Jun, 2016 18:16 IST|Sakshi
లోఫర్ అంటే తప్పా?

 మైసూర్: లోఫర్ (ఓ లక్ష్యం అంటూ లేకుండా గాలికి తిరిగేవాడు) అంటూ మైసూరు యూనివర్శిటీకి చెందిన జర్నలిజం ప్రొఫెసర్ ఎప్పుడో ఏడాది క్రితం రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై దాఖలైన రెండు కేసుల్లో అరెస్టై వారం రోజులపాటు జుడీషియల్ కస్టడీకి వెళ్లిన ప్రొఫెసర్ బీపీ మహేశ్‌చంద్ర గురు... శుక్రవారం నాడు విడుదలయ్యారు. ఆయనకు ఓ కేసులో ఈ జూన్ 18వ తేదీన, రెండో కేసులో జూన్ 24వ తేదీన బెయిల్ మంజూరైంది.

కర్ణాటకలోని మైసూర్ యూనివర్శిటీలో 2015, జనవరి నెలలో ‘అంబేడ్కర్-హిందూయిజం’ అనే అంశంపై బహుజన విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ఓ సదస్సులో మహేశ్‌చంద్ర గురు మాట్లాడుతూ అయోధ్య రాముడిని లోఫర్ అని వ్యాఖ్యానించారట. ఈ వార్తను పత్రికలో చదివిన కరుణాడ రక్షణ వేదిక అనే హిందూ సంస్థకు చెందిన సీవీ రవిశంకర్ అనే వ్యక్తి గతేడాది జనవరి నెలలోనే కేసు నమోదు చేశారు.

హిందూ జాగారన్ వేదికకు చెందిన ప్రేమ్‌కుమార్ అనే మరో వ్యక్తి ఫిబ్రవరి నెలలో ప్రొఫెసర్‌పై మరో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల గురించి ఆ ప్రొఫెసర్ పూర్తిగా మరచిపోయారు. ఈ కేసులను విచారించిన మైసూరు కోర్టు జూన్ 18వ తేదీన ప్రొఫెసర్‌ను జుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై స్పందించిన పోలసులు ప్రొఫెసర్‌ను జుడీషియల్ కస్టడీకి పంపించారు. పౌర హక్కుల ప్రజా సంఘానికి చెందిన కర్ణాటక విభాగం ప్రొఫెసర్ తరఫున వాదించడంతో ఆయనకు రెండు కేసుల్లోనూ బెయిల్ లభించింది.

ఓ విద్యావేత్తను, ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పౌర హక్కుల సంఘం వాదిస్తోంది. సదస్సుకు హాజరైన వ్యక్తులు కాకుండా ఓ పత్రికలో వచ్చిన వార్తను చూసి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తోంది. ఫిర్యాదు చేసిన వారికి లోకల్‌స్టాండీ కూడా లేదని వాదిస్తోంది. లోఫర్ అనే పదాన్ని నేరపూరితమైన, అవమానకరమైన పదంగా ఎలా పరిగణిస్తారని కూడా ప్రశ్నిస్తోంది. ఓ మతాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా ఎవరు ప్రయత్నించకూడదని చెబుతున్న భారతీయ శిక్షాస్మృతిలోని 295(ఏ) సెక్షన్ కింద పోలీసులు ప్రొఫెసర్‌పై కేసులు నమోదు చేశారు.

గతంలోకూడా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ‘లోఫర్’ అనే పదంపై వివాదం చెలరేగింది. 1990వ దశకంలో కర్ణాటక రైతు ఉద్యమ నిర్మాత, లీగల్ స్కాలర్ దివంగత ప్రొఫెసర్ నంజుండస్వామి అప్పటి ముఖ్యమంత్రిని ఒక లోఫర్ అని అభివర్ణించారు. కర్ణాటక రాజకీయ వర్గాల్లో దీనిపై గొడవ జరిగింది. క్షమాపణలు చెప్పాలని నంజుండస్వామిని డిమాండ్ చేశారు. అందుకు ఆయన ససేమిరా అంగీకరించలేదు. తాను అన్న లోఫర్ అనే పదం అవమానకరమా, అన్‌పార్లమెంటరీనా తేల్చాలని కూడా ఆయన సభలో డిమాండ్ చేశారు. లోఫర్ అంటే నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా గాలికి తిరిగేవాడని అర్థమని కూడా స్కాలర్‌గా ఆయన వివరించారు. అంతటితో ఆ గొడవ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు లోఫర్‌కు భాష్యం చెప్పాల్సింది మైసూర్ కోర్టు.

మరిన్ని వార్తలు