ఎన్టీఆర్‌ బయోపిక్‌పై తారక్‌ కామెంటు

8 Jul, 2017 20:52 IST|Sakshi
ఎన్టీఆర్‌ బయోపిక్‌పై తారక్‌ కామెంటు

హైదరాబాద్‌: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితచరిత్రపై సినిమా అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, బాలకృష్ణ ఎన్టీఆర్‌ జీవితంపై (వేర్వేరుగా?) సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ఆసక్తిరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తాత బయోపిక్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. హైదరాబాద్‌ మదాపూర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన బిగ్‌బాస్ ప్రీ లాంచ్ ఈవెంట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా విషయమై తారక్‌ అభిప్రాయాన్ని కోరాగా.. ఆయన స్పందిస్తూ ‘నందమూరి తారక రామారావు గారు ఏ ఒక్క కుటుంబానికి చెందిన వారో కాదు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు ప్రజల సొత్తు.  ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు.

తన జీవితానికి ఎన్టీఆరే స్ఫూర్తి అని, ఎందరో అభిమానులకు ఆయన దైవంతో సమానమని పేర్కొన్నారు. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌పై సినిమా చేయడంపై స్పందిస్తూ.. ఇది బ్రహ్మాండమైన విషయమన్నారు. ఎన్టీఆర్ జీవితచరిత్రపై సినిమా రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద అంశాలను కూడా తెరపై చూపిస్తానన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పుడే ఎందుకు సినిమా రూపొందే సమయంలో వాటి గురించి ఆలోచిద్దాం. అప్పటివరకు వేచి చూద్దాం అంటూ దాటవేశారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు