సుప్రీం కోర్టు జడ్జిలపై పరువు నష్టం దావా వేస్తా

17 Mar, 2017 16:12 IST|Sakshi
సుప్రీం కోర్టు జడ్జిలపై పరువు నష్టం దావా వేస్తా

కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుతో ఘర్షణ, ధిక్కార వైఖరిని కొనసాగిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను తీసుకునేందుకు ఆయన తిరస్కరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పశ్చిమబెంగాల్ డీజీపీ సురజిత్ కర్ పురకాయస్తా, కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు.. బెయిలబుల్ వారెంట్ అందజేసేందుకు జస్టిస్ కర్ణన్ నివాసానికి వెళ్లారు. ఈ నెల 31న విచారణకు హాజరు కావాల్సిందిగా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ కర్ణన్‌ను ఆదేశించింది. అయితే వారెంట్ తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సుప్రీం కోర్టు జడ్జిలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన జీవితానికి, మనశ్శాంతికి భంగం కలిగించినందుకు సుప్రీం కోర్టు 14 కోట్ల రూపాయల నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మద్రాస్ హైకోర్టు జడ్జిలు, మాజీ న్యాయమూర్తులు కొందరు అవినీతికి పాల్పడ్డారని జస్టిస్ కర్ణన్ గతంలో ఆరోపించారు. జడ్జిల ఫిర్యాదు మేరకు మద్రాస్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్.. జస్టిస్ కర్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. అంతేగాక మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి భార్య ఆయనపై సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు హాజరుకానందుకు సుప్రీం కోర్టు ఆయనకు వారెంట్ జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టుపై సంచలన ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు వారెంట్ జారీ చేయడం చట్టవిరుద్ధమని, ఓ దళిత జడ్జిని వేధించడమేనని అన్నారు. తనను వేధించడం మానుకోవాలని కోరారు. తనపై వారెంట్ జారీ చేసి సుప్రీం కోర్టు ప్రపంచం ముందు నవ్వుల పాలైందని విమర్శించారు. సుప్రీం కోర్టులో తాను ఎందుకు హాజరు కావాలని, ఇది తప్పుడు ఉత్తర్వు అని, చట్టవిరుద్ధమని అన్నారు. హైకోర్టు జడ్జీపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు