7వ వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ మాథుర్

5 Feb, 2014 00:28 IST|Sakshi
7వ వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ మాథుర్

సిఫార్సులు అందజేసేందుకు రెండేళ్ల గడువు
 
 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఏడవ వేతన సంఘం చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏడవ వేతన సంఘం కూర్పునకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేతన సంఘంలోని ఇతర సభ్యులు.. చమురుశాఖ కార్యదర్శి వివేక్ రే(పూర్తి స్థాయి సభ్యుడు), ఎన్‌ఐపీఎఫ్‌పీ డెరైక్టర్ రాథిన్ రాయ్(పార్ట్‌టైమ్ సభ్యులు), వ్యయశాఖలోని ఓఎస్‌డీ మీనా అగర్వాల్(కార్యదర్శి). 50 లక్షల మందికిపైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణతోపాటు 30 లక్షల మంది పెన్షనర్లకు చెల్లించే రెమ్యునరేషన్ సవరణలపై ఏడవ వేతన సంఘం తగిన సిఫార్సులు చేస్తుంది.
 
 కమిషన్ తన నివేదికను రెండేళ్లలోగా సమర్పించాలని గడువు నిర్దేశించారు. వేతన సంఘం చేసే సిఫార్సులు 2016, జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌లోనే ఏడవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆరవ వేతన సంఘం సిఫార్సులు 2006, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి.


 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా