రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవు

7 Oct, 2016 04:47 IST|Sakshi
రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవు

రిజర్వేషన్ల కోసమే రోహిత్ తల్లి కులం సర్టిఫికెట్ తీసుకున్నారు
* వ్యక్తిగత విషయాలే రోహిత్ ఆత్మహత్యకు కారణం
* రోహిత్ ఆత్మహత్యలో రాజకీయ జోక్యం లేదు
* ఇందులో హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వానికి బాధ్యత లేదు
* కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయకు క్లీన్‌చిట్
* హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిన రూపన్వాల్ కమిషన్


సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ తల్లి రాధిక రిజర్వేషన్ల లబ్ధి కోసమే తనని తాను దళిత్‌గా ప్రకటించుకున్నారని పేర్కొంది. రోహిత్ తల్లి రాధిక కన్నతల్లిదండ్రులు ఎవ్వరో తెలియకుండా ఆమెను పెంచిన తల్లి.. రాధిక ఎస్‌సీ అని చెప్పడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది.

ఆమె దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. రాధిక వాంగ్మూలం ఆధారంగా రోహిత్‌కు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆగస్టు 1న హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖకు 41 పేజీల నివేదికను సమర్పించింది.
 
50 మందిని విచారించిన కమిషన్
రోహిత్ ఆత్మహత్యపై దుమారం చెలరేగడంతో ఈ ఏడాది జనవరి 28న హెచ్‌ఆర్‌డీ శాఖ నియమించిన ఏకసభ్య కమిషన్ మొత్తం 50 మందిని విచారించినట్టు పేర్కొంది. అందులో అత్యధికులు వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందే. ఇందులో సామాజిక న్యాయ ఐక్య పోరాట కమిటీ నేతృత్వంలో ఉద్యమించిన ఐదుగురు విద్యార్థి జేఏసీ నాయకులు సైతం ఉన్నారని కమిషన్ వివరించింది. వాస్తవానికి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన విషయాల్లోని నిజానిజాలు.. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు.. అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ విచారించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా చాలా అంశాలను ముఖ్యంగా రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది.
 
పలు సిఫార్సులు చేసిన కమిషన్
విద్యార్థుల కోసమే కాక రీసెర్చ్ స్కాలర్ల కోసం తగిన కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే రోహిత్ మాదిరిగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను, సమాన అవకాశాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
 
నివేదికను స్వాగతించిన వీసీ అప్పారావు
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై హెచ్‌సీయూ వీసీ పొదిలె అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ అప్పారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాము ఇప్పటి వరకూ నివేదికను చూడలేదని, అయితే అందులోని అంశాలపై ఒక యూనివర్సిటీగా తాము సంతోషంగా ఉన్నామని అప్పారావు చెప్పారు. రోహిత్ ఆత్మహత్యతో విశ్వవిద్యాలయానికి సంబంధం లేదంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించడాన్ని తాము గతిస్తున్నామన్నారు.
 
కేంద్ర మంత్రులకు క్లీన్‌చిట్
యూనివర్సిటీలో జరిగిన విష యాల్లో రాజకీయ జోక్యం ఏమాత్రం లేదని కమిషన్ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ వారి బాధ్యతలను వారు నిర్వర్తించారు తప్ప వర్సిటీ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని నివేదికలో రూపన్వాల్ కమిషన్ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రోహిత్‌ను వర్సిటీ హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ అధికారులుతీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని పేర్కొన్నట్టు తెలిసింది.
 
వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య..
రోహిత్ మరణానికి వ్యక్తిగత అంశాలే కారణ మని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రోహిత్ నిరాశా నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అంతే తప్ప వివక్ష అతని ఆత్మహత్యకు కారణం కానేకాదని తేల్చి చెప్పింది. రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ కారణం కాదని, అది అతని స్వయంకృతాపరాధమేనని పేర్కొంది.

రోహిత్ ఆత్మహత్యకు అప్పటికప్పుడు యూనివర్సిటీలో తన చుట్టూ జరిగిన విషయాలేవీ కారణం కాదని, ఇదే విషయాన్ని అతని లేఖ స్పష్టం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ రోహిత్ ఆత్మహత్యకు కారణం అయితే అదే విషయాన్ని అతను తన లేఖలో ప్రస్తావించి ఉండేవాడని స్పష్టం చేసింది. తన ఆత్మహత్యకు కారణం ఫలానా అని అతను ఎక్కడా పేర్కొనకపోగా, తాను బాల్యం నుంచి ఒంటరితనాన్ని అనుభవించానని, మెచ్చుకోలుకి కూడా నోచుకోలేదని స్వయంగా రాసుకున్నాడని రిపోర్టు తెలియజేసింది. దీన్ని బట్టి అతను నిరాశా నిస్పృహలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదిక తేల్చింది.

మరిన్ని వార్తలు