తెలంగాణను అడ్డుకున్న వారే.. ప్రగతినీ

26 Jul, 2015 23:04 IST|Sakshi

హన్మకొండ కల్చరల్ (వరంగల్ జిల్లా): తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నవారే ప్రగతిని కూడా అడ్డుకుంటున్నారని.. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి ఇలాంటి వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి ఆమర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరెందరో వివిధ రకాలుగా కృషిచేశారని, తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. తీరా తెలంగాణ వచ్చే సమయానికి పక్కకు పోయినవారు కూడా ఉన్నారని అన్నారు. 15 ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరించిన అనాలోచిత చర్యల వల్ల విశ్వవిద్యాలయాలు కోలుకొలేనంతంగా దెబ్బతిన్నాయన్నారు.

కేవలం 8మంది ప్రొఫెసర్లతో పాలమూరు విశ్వవిద్యాలయం కొనసాగడం బాధకరమని.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నియూమకాలు జరిగాయన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు భవిష్యత్‌లో న్యాక్ గుర్తింపు కష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి స్టాఫ్‌ను నియమించుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చాన్స్‌లర్, వైస్ చాన్సలర్లను నియమించడానికి కొత్తచట్టాలను తేవడంలో కొంత అలస్యం జరుగుతోందన్నారు. త్వరలో విద్యావేత్తలతో ఈ విషయమై సమావేశమవుతానన్నారు.

మరిన్ని వార్తలు