నటి కిడ్నాప్‌: టీవీ చానెల్‌ దారుణమైన కథనం!

20 Feb, 2017 10:28 IST|Sakshi
నటి కిడ్నాప్‌: టీవీ చానెల్‌ దారుణమైన కథనం!

పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రముఖ మలయాళీ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నటి డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కేరళలో పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో అధికార సీపీఎంకు చెందిన కైరాలి టీవీ ప్రసారం చేసిన కథనాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నటిపై లైంగిక దాడి జరిగిదంటూ వివరాలను ఆ చానెల్‌ ప్రసారం చేయడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. నటి కిడ్నాప్‌, దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఆమె డ్రైవర్‌తో, ఆమెకు సంబంధం ఉందంటూ ఓ తలాతోక లేని కథనాన్ని కైరాలీ టీవీ ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

పలు మీడియా చానెళ్లు కూడా మొదట నటి పేరును వెల్లడించాయి. అయితే, చట్టప్రకారం లైంగిక దాడికి గురైన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉండటంతో ఆ తర్వాత తమ తీరును మార్చుకున్నాయి. కైరాలీ టీవీ అత్యుత్సాహం, అసంబద్ధ కథనాలపై ప్రముఖ మలయాళీ నటి రిమా కల్లింగల్‌ ఫేస్‌బుక్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాటి వ్యక్తి తన జీవితంలోనే అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు సానుభూతి చూపాల్సిందిపోయి.. సెన్సేషనల్‌ కథనాల పేరిట దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆమె మండిపడ్డారు. నటుడు పృథ్వీరాజ్‌ కూడా మీడియా తీరుపై మండిపడ్డారు. కేవలం టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం తప్పుడు కథనాలు, సెన్సేషనలైజ్‌ చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. దీంతో దిగివచ్చిన కైరాలీ టీవీ యాజమాన్యం తన ప్రసారాల పట్ల క్షమాపణలు చెప్పింది.

మరిన్ని వార్తలు