కలాంకు పార్లమెంటు ఘన నివాళి

29 Jul, 2015 01:16 IST|Sakshi
కలాంకు పార్లమెంటు ఘన నివాళి

ఉభయ సభల్లో మౌనం పాటించిన సభ్యులు
గొప్ప దార్శనికుడిని దేశం కోల్పోయిందన్న లోక్‌సభ స్పీకర్
అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాల మార్గదర్శి కలాం: ఉపరాష్ట్రపతి

 
న్యూఢిల్లీ: తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు భారత పార్లమెంటు మంగళవారం ఘన నివాళులర్పించింది. కలాం భారతదేశపు గొప్ప పుత్రుడని అభివర్ణించింది. నిజమైన మేధావి అని, ఆయన సేవలను దేశం తరతరాలు స్మరించుకుంటుందని శ్లాఘించింది.  ఉభయ సభల సభ్యులు తమతమ స్థానాల్లో నిల్చుని కలాం మృతికి నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ వెంటనే, పార్లమెంటు  సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. దివికేగిన ఈ ప్రజా రాష్ట్రపతికి గౌరవ సూచకంగా, అలాగే, కలాం అంత్యక్రియలకు సభ్యులు హాజరయ్యేందుకు వీలుగా బుధవారం కూడా పార్లమెంటు సమావేశాలు జరపకూడదని నిర్ణయించారు. అయితే, కలాం అంత్యక్రియలను తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశ్వరంలో గురువారం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లోక్‌సభలో..‘డాక్టర్ కలాం మృతితో దేశం ఒక అద్భుత దార్శనికుడిని, గొప్ప శాస్త్రవేత్తను, అణగారిన వర్గాల స్నేహితుడిని, మానవతావాదిని కోల్పోయింది’ అని సంతాప తీర్మానంలో లోక్‌సభ ప్రశంసించింది. తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. ‘దేశ యువతను కలసి మాట్లాడుతూ, వారిలో విజ్ఞాన తృష్ణను రగల్చడాన్ని ఎంతో ప్రేమించే కలాం.. చివరి క్షణం వరకు అదే విధిలో నిమగ్నమయ్యార’ని స్పీకర్ కొనియాడారు. ‘8 ఏళ్ల చిన్నారి చిరునవ్వును.. 38 ఏళ్ల యువకుడి శక్తి, ఉత్సాహాలను.. కలిగిన 83 ఏళ్ల మహోన్నతుడు డాక్టర్ కలాం’ అని అభివర్ణించారు. ఆయన మృతి ఒక శూన్యాన్ని ఏర్పరిచిందని, అయినా, ఆయన స్ఫూర్తి మనలో కలకాలం నిలుస్తుందన్నారు. అలుపెరగని విజ్ఞాన తృష్ణ కలిగిన కలాం.. భారత దేశ అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాల వెనుక కీలక చోదక శక్తిగా నిలిచారన్నారు. అందుకే ఆయన ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతిగాంచారన్నారు. నిర్వహణాసామర్థ్యంతోనూ 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారని స్పీకర్ గుర్తుచేశారు.

రాజ్యసభలో.. కలాం మరణం దేశానికి పూడ్చలేని లోటని రాజ్యసభ పేర్కొంది. శాస్త్రవేత్తగా, ఉపాధ్యాయుడిగా, నాయకుడిగా దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలు గుర్తుండిపోతాయని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కొనియాడారు. కలాం భారతదేశ అంతరిక్ష, క్షిపణి కార్యక్రమాలకు మార్గదర్శి అని, ఆయన కృషి వల్లే ఈ రంగాల్లో భారత్ కీలక శక్తిగా ఎదిగిందని అన్నారు. 2020 నాటికి స్పందనగల, పారదర్శక, అవినీతిరహిత ప్రభుత్వం నేతృత్వంలోని భవిష్యత్ భారతాన్ని ఆయన ఆకాంక్షించారని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన వ్యవహారశైలి ఆయనను ప్రజా రాష్ట్రపతిగా నిలిపిందన్నారు.

 ఉగ్రదాడి  మృతులకు కేబినెట్ నివాళి
 పంజాబ్‌లోని దీనానగర్‌లో సోమవారం నాటి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పోలీసులు, పౌరులకు కేంద్ర కేబినెట్ మంగళవారం నివాళులర్పించింది. ఒక సంతాప తీర్మానాన్ని కూడా ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ ఆమోదించింది.
 
 

మరిన్ని వార్తలు