ఉద్యోగులకు మేలు చేయండి.. దొంగలకు కాదు

4 Mar, 2016 03:49 IST|Sakshi
ఉద్యోగులకు మేలు చేయండి.. దొంగలకు కాదు

ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను వద్దు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఉపసంహరణపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశమివ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేయాలిగానీ దొంగలకు కాదని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగులకు రక్షణగా ఉండే ఎంతో ముఖ్యమైన పీఎఫ్‌పై పన్ను విధించడం సరికాదు. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం నింపాలని  ప్రధాని మోదీని కోరుతున్నా..’’ అని రాహుల్ పేర్కొన్నారు.

చిల్లర రాజకీయ ప్రసంగం
పలు రంగాల్లో సంక్షోభం ఎదుర్కొంటున్న దేశానికి సాంత్వన చేకూర్చేలా ప్రధాని మోదీ ప్రసంగం లేదని కాంగ్రెస్ విమర్శించింది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై స్పందించకుండా చిల్లర రాజకీయాలకే ఆయన ప్రసంగం పరిమితమైందని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. కృశ్చేవ్ వ్యాఖ్యలను మోదీ ఉటంకించడం ప్రమాదకర ధోరణికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, వ్యతిరేకించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాల గురించి కానీ ఆయన ఒక్కమాటా మాట్లాడలేదు’ అన్నారు. నెహ్రూ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేయడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఈ మధ్య ప్రధాని కాస్త చదవడం ప్రారంభించినట్లున్నారు.

మరిన్ని వార్తలు