టీచర్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి

23 Mar, 2017 07:27 IST|Sakshi
టీచర్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి

- అర్ధరాత్రికి పూర్తయిన ఓట్ల లెక్కింపు
- 11 రౌండ్‌ అనంతరం తేలిన ఫలితం
- నేడు ధ్రువీకరణ పత్రం అందజేత


సాక్షి, హైదరాబాద్‌:
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా అధికార టీఆర్‌ఎస్‌ బలపరిచిన సిట్టింగ్‌ సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తిరిగి గెలుపొందారు. విజయానికి 9,670 ఓట్లు కావాల్సి ఉండగా, 11వ రౌండ్‌ పూర్తయ్యేప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో 9,734 ఓట్లు సాధించి నెగ్గారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చాక ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. గత ఎన్నికల్లో కూడా కాటేపల్లి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు!

చీలిన ఓట్లు
ఓట్ల లెక్కింపు సన్నాహాలు బుధవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైనా లెక్కింపు మధ్యాహ్నం తర్వాతే మొదలైంది. ఆసక్తికర మలుపుల మధ్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత పూర్తయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో కాటేపల్లికి మిగతా అందరికంటే ఎక్కువ ఓట్లొచ్చినా విజయానికి అవి చాలలేదు. తొలి రౌండ్‌లో ఆయనకు 7,640, మిగతా అభ్యర్థులందరికీ కలిపి 11,698 ఓట్లు లభించాయి. దాంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. వ్యతిరేక ఓట్లు చీలడం కాటేపల్లికి లాభించింది. ఈ నెల 9న జరిగిన పోలింగ్‌ ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో రద్దవడం, 19న రీ పోలింగ్‌ జరగడం తెలిసిందే.

ఆ ఎన్నికలో 88.67 శాతం పోలింగ్‌ నమోదవగా, రీ పోలింగ్‌లో 82.49 శాతానికి పరిమితమైంది. ఓట్ల శాతం తగ్గడం ఎవరికి అనుకూలం కానుందనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ బలపరచిన కాటేపల్లికి ఇతరులు గట్టి పోటీనిచ్చారు. కానీ వారి ఓట్లు చీలడంతో ఎవరూ విజయానికి సమీపంగా రాలేకపోయారు. తొలి ప్రాధాన్యత ఓట్లను రెండు విడతలుగా లెక్కించారు. తొలి రౌండ్‌లో కాటేపల్లికి 7,640 ఓట్లు, ఏవీఎన్‌ రెడ్డి (ఎస్‌టీయూ)కి 3,091, పాపన్నగారి మాణిక్‌రెడ్డి (యూటీఎఫ్‌)కి 3,048 ఓట్లు లభించాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 2,482 ఓట్లు లభించాయి. తొలి పోలింగ్‌లో ఫొటో తారుమారైన అభ్యర్థుల్లో మాణిక్‌రెడ్డికి మూడో స్థానం లభించగా, ఆదిలక్ష్మయ్యకు కేవలం 461 ఓట్లు పడ్డాయి! అందరికంటే తక్కువగా అరకల కృష్ణాగౌడ్‌కు కేవలం 10 ఓట్లు రావడంతో రెండో రౌండ్‌లో ఆయనను తొలగించి మిగతా వారికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. చివరి రౌండ్‌ ముగిసేసమయానికి మాణిక్‌రెడ్డికి 5,095 ఓట్లు లభించాయి.

చెల్లిన ఓట్లు: 19,338
విజయానికి కావాల్సిన ఓట్లు: 9,670
కాటేపల్లికి వచ్చిన ఓట్లు: 9,734


నేడు జనార్దన్‌రెడ్డి విజయోత్సవ సభ
సాక్షి, హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి విజయోత్సవ సభను గురువారం సిద్ధిపేటలో నిర్వహిస్తున్నట్లు పీఆర్‌టీ యూఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులి సరోత్తంరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి తెలిపారు.