ఇది మన 'మహా' విజయం

7 Mar, 2016 06:41 IST|Sakshi
ఇది మన 'మహా' విజయం

ఎలుగెత్తి చాటుదాం.. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్
*  మహారాష్ట్రతో ‘గోదావరి’ ఒప్పందం మామూలు విషయం కాదు
*  బ్యారేజీల నిర్మాణానికి ముందుకు రావడం చాలా అరుదు
*  దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా దీన్ని ఉపయోగించుకోవాలన్న ముఖ్యమంత్రి
*  రేపు కేసీఆర్, మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఒప్పందం
* కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
* మంత్రి తలసానికి సమన్వయ బాధ్యతలు
* స్వాగత కార్యక్రమానికి జిల్లాల నుంచి రైతులు
* గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం

 సాక్షి, హైదరాబాద్:
 ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాల వివాదం పరిష్కారం కావడం తెలంగాణకు శుభసూచకం. ఇది సాధారణ విషయం కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడం, అయిదు బ్యారేజీల నిర్మాణాన్ని ఉమ్మడిగా చేపడదామని ముందుకు రావడం దేశ చరిత్రలో అరుదైన విషయం. గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోబోతున్నాం. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ విషయాన్ని సామాన్యంగా తీసుకోవద్దు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులతో పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవ్వాల్సిన గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తే దీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశానికి ఎజెండాలో 25కు పైగా అంశాలను పొందుపరిచారు. అయితే అందులో కేవలం సగం మాత్రమే చర్చించార ని, మిగతా అంశాలను తర్వాత చర్చిద్దామని పక్కన పెట్టినట్లు తెలిసింది. ఎజెండాలోని ప్రధాన అంశమైన సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, అంచనాల పెంపు, నామినేషన్ పద్ధతిన పనుల కేటాయింపు అంశాలను మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా పక్కన పెట్టారని సమాచారం. సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. సమావేశం ముగియగానే మంత్రులు, అధికారులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆయా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... కేబినెట్‌లో గవర్నర్ ప్రసంగం ఆమోదంపైనే సుమారు గంటన్నర సేపు చర్చ జరిగినట్టు తెలిసింది. బడ్జెట్‌పైనా సవివరమైన చర్చ జరిగింది.

 ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు
 గోదావరిపై అయిదు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇందుకు సోమవారం ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డితో కలిసి మహారాష్ట్ర వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబైలోని రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాత్రి రాజ్‌భవన్‌లోనే సీఎం బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10.10 గంటలకు సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, ప్రాణహితపై నిర్మించే తుమ్మిడిహెట్టి, పెన్‌గంగపై నిర్మించనున్న ఛనఖా-కొరటా, పిన్‌పహాడ్, రాజాపేట ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలపై ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భోజనం అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. కేసీఆర్ నగరానికి చేరుకునే సమయంలో ఆయనకు ఘన స్వాగతం పలకాలని పలువురు మంత్రులు కేబినెట్‌లో ప్రతిపాదించి, ఆ మేరకు కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిసింది. బేగంటపేట విమానాశ్రయం నుంచి సీఎంకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమ సమన్వయ బాధ్యతలను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అప్పజెప్పారని తెలిసింది. జీఎంహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజలను సమీకరించే బాధ్యతలను కార్పొరేటర్లకు అప్పజెప్పనున్నారు. గోదావరి జలాల ద్వారా లబ్ధి పొందనున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి రైతులను స్వాగత కార్యక్రమానికి  తరలించాలని, ఈ బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారని సమాచారం. మొత్తానికి గోదావరి జలాల విషయంలో చేసుకోబోతున్న ఒప్పందాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం పొందే రీతిలో ఏర్పాట్లు చేయనున్నారు.

 ఎస్సీ, ఎస్టీ వాడలను దత్తత తీసుకుందాం
 రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ‘‘ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా, ఎంతగా నిధులు వెచ్చిస్తున్నా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నా, ఇంకా ఈ వర్గాల్లో అభివృద్ధి కనిపించడం లేదు.. ’’ అని కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీల వాడలను దత్తత తీసుకోవడం ద్వారా పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రతిపాదించారని సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఒక్కో కాలనీని దత్తత తీసుకోవాలని చర్చించారని సమాచారం. అయితే, సీఎం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరిగినా, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరోసారి దీనిపై చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 ప్రభుత్వ పథకాలకు ఎస్‌ఎస్‌సీ విధానం
 రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే వివిధ పథకాలను విజయవంతం చేసేందుకు, అత్యధికులు లబ్ధిపొందేలా పర్యవేక్షణ ఉండాలన్న చర్చ కూడా కేబినెట్‌లో జరిగింది. ప్రతీ పథకంలో ఎస్.ఎస్.సి.(స్టాండర్‌డైజేషన్, స్టెబిలైజేషన్, కన్సాలిడేషన్/ప్రమాణీకరణ, స్థిరీకరణ, ఏకీకరణ) విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారని తెలిసింది. భవిష్యత్తులో చేబట్టబోయే పథకాలకూ ఈ విధానమే వర్తింపజేయాలని సూచించారని సమాచారం.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా