బల్దియా భవితవ్యం.. తేలేది నేడే

5 Feb, 2016 01:30 IST|Sakshi
బల్దియా భవితవ్యం.. తేలేది నేడే

* సాయంత్రం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
* 5 గంటలకల్లా తొలి ఫలితాలు.. 7 గంటలకల్లా తుది లెక్కలు
* గెలుపు ధీమాతో అధికార టీఆర్‌ఎస్
* మెజారిటీ స్థానాలు తమవే అంటున్న గులాబీ శ్రేణులు
* నేడు పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్
* భారీగా బందోబస్తు.. 800 మంది ఆర్‌ఏఎఫ్ సిబ్బంది మోహరింపు

సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో విజేతలెవరో కొద్దిగంటల్లో తేలిపోనుంది.

శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... సాయంత్రం 5 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశముంది. 7 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మెజారిటీ డివిజన్లు దక్కించుకుని, ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం భరోసాతో ఉంది. జీహెచ్‌ఎంసీ-2009 ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లోనూ పోటీ చేయని టీఆర్‌ఎస్... ఈసారి ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో 150 డివిజన్లకు పోటీ పడింది. ఎంఐఎం ప్రభావం బలంగా ఉంటుందని భావించే పాతబస్తీలోనూ ఈసారి తాము ఖాతా తెరుస్తామన్న ఆశాభావాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఫలితాలపై ఉత్కంఠ..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన మంగళవారం పాతబస్తీలో ఎంఐఎం-కాంగ్రెస్, ఎంఐఎం-టీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ... ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం నాడే పురానాపూల్ డివిజన్ కు రీపోలింగ్ జరగనుండడంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ రోజే వివిధ మీడియా, ఇతర  సంస్థలు స్వతంత్రంగా జరిపిన సర్వేలు, ‘ఎగ్జిట్ పోల్’ల అంచనాల ఆధారంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ, ఎంఐఎం, ఇతరులు గెలుపొందే డివిజన్ల సంఖ్యపై ప్రచారం జరిగింది. దీంతో సహజంగానే శుక్రవారం జరగనున్న కౌంటింగ్‌పై చర్చ జరుగుతోంది.

రీపోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభిస్తామని, 5గంటల కల్లా తొలి ఫలితాలు వెలువడతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తుది ఫలితాలు ఏడు గంటల కల్లా వెలువడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
 
గెలుపుపై టీఆర్‌ఎస్ భరోసా
జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ (76)ను దాటుతామని టీఆర్‌ఎస్ నాయకత్వం భరోసా వ్యక్తం చేస్తోంది. తాము 77 నుంచి 85 డివిజన్ల దాకా గెలవబోతున్నామని... ఎవరి సాయం లేకుండానే మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్ 19.71 శాతం ఓట్లను పొందింది.

తాజాగా తమ అంతర్గత సర్వేల ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం 42 శాతం ఓట్లు పొందుతామని పార్టీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయని తెలిసింది. ఈ కారణంగానే అత్యధిక డివిజన్లలో గెలుస్తామని, జీహెచ్‌ఎంసీలో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తామని చెబుతోంది. ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం అధికార పార్టీ 90కిపైగా డివిజన్లలో విజయం సాధిస్తుందని నివేదికలు అందించినట్లు తెలిసింది.
 
పురానాపూల్ డివిజన్‌లో భారీగా బందోబస్తు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీలోని పురానాపూల్‌లో చోటు చేసుకున్న ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పురానాపూల్ డివిజన్‌కు శుక్రవారం జరుగనున్న రీ-పోలింగ్‌కు శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతల నుంచి సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను తప్పించి.. మరో సీనియర్ పోలీసు అధికారికి అప్పగించాలని గురువారం ఆదేశించింది. ఈ మేరకు పురానాపూల్ డివిజన్ రీ-పోలింగ్ ఇన్‌చార్జిగా సంయుక్త పోలీస్ కమిషనర్ శివప్రసాద్‌ను నియమిస్తూ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పురానాపూల్‌లో కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్‌లోని 36 పోలింగ్ స్టేషన్లకు 36 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించారు. ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. సంయుక్త, అదనపు పోలీసు కమిషనర్లు సైతం పరిస్థితుల్ని సమీక్షిస్తుంటారు. 800 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు