కేజ్రీవాల్ కేరాఫ్ డూప్లెక్స్

4 Jan, 2014 01:54 IST|Sakshi
కేజ్రీవాల్ కేరాఫ్ డూప్లెక్స్

అధికారిక నివాసం స్వీకరించిన ‘సామాన్యుడు’
ఐదేసి బెడ్రూంల రెండు డూప్లెక్స్‌లలోకి త్వరలో మకాం మార్పు
ఒకటి నివాసానికి, మరొకటి క్యాంపు ఆఫీసు కోసం...
ఇళ్ల మొత్తం విస్తీర్ణం సుమారు 9 వేల చదరపు అడుగులు


 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా రూటుమార్చారు. వీఐపీ సంస్కృతికి దూరమంటూ ఇప్పటివరకూ జెడ్ కేటగిరీ భద్రతను, కాన్వాయ్‌ను, ప్రభుత్వ బంగ్లాను తోసిపుచ్చి ఘజియాబాద్‌లోని కౌశాంబీలో ఉన్న ఫ్లాట్ నుంచే ఆఫీసుకు వస్తున్న కేజ్రీవాల్ తాజాగా తన మకాంను ఐదు బెడ్రూంల డూప్లెక్స్‌లోకి మార్చనున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్డులో ఐదేసి బెడ్రూంలుగల రెండు డూప్లెక్స్ ఇళ్లను అధికారిక నివాసంగా స్వీకరించేందుకు ఆయన అంగీకరించారు. ఒక డూప్లెక్స్‌ను (ఫ్లాట్ నంబరు 7/6) కుటుంబంతో కలిసి ఉండేందుకు, మరో డూప్లెక్స్ (ఫ్లాట్ నం 7/7)ను తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్న టైప్-8 ప్రభుత్వ బంగ్లా (3-మోతీలాల్ నెహ్రూ మార్గ్) అంత భారీగా కాకపోయినా ఈ డూప్లెక్స్ ఇళ్లు కూడా పెద్దవే. రెండు డూప్లెక్స్‌ల విస్తీర్ణం సుమారు 6 వేల చదరపు అడుగులు ఉంది.

ఇళ్ల ముందున్న లాన్‌ను కూడా కలుపుకుంటే విస్తీర్ణం సుమారు 9 వేల చదరపు అడుగులు ఉంటుంది. ఈ డూప్లెక్స్‌ల ఇళ్ల తాళాలను అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటికే అందించారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం ఈ ఇళ్లను సందర్శించారు. కేజ్రీవాల్ అవసరానికి తగినట్లుగా ప్రస్తుతం ఈ డూప్లెక్స్‌లలో పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ సెక్రటేరియట్‌తోపాటు కన్నాట్ ప్లేస్‌లోని తన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి చేరువగా ఉండేలా ఈ డూప్లెక్స్‌లను ఎంపిక చేశారు. ఈ ఇళ్లు ఉన్న ప్రాంతం కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహించే న్యూఢిల్లీ పరిధిలోనే ఉంది. వాస్తవానికి ఈ రెండు డూప్లెక్స్‌లను ఢిల్లీ డిస్ట్రిక్ట్ అథారిటీ సభ్యుడు, ప్రిన్సిపల్ కమిషనర్ కోసం కేటాయిస్తూ వస్తున్నారు.

 షీలా ఇంటితో పోల్చి చూడండి: కేజ్రీవాల్

 అధికారిక నివాసం గురించి విలేకరులు కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా ‘నాకు ఐదేసి బెడ్రూంల రెండు ఇళ్లు కేటాయించారు. కావాలంటే కెమెరాలు తీసుకెళ్లి తనిఖీ చేసుకోండి. అలాగే అంతకుముందు సీఎం ఇంటితో పోల్చి చూడండి. నేను ఇప్పటివరకూ నాలుగు బెడ్రూంల ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడది ఐదు బెడ్రూంలు అయింది. అంతే తేడా’ అని వ్యాఖ్యానించారు. షీలా దీక్షిత్ ఉంటున్న టైప్-8 బంగ్లా విస్తీర్ణం సుమారు 9,000 చదరపు అడుగులు. ఇందులో బంగ్లాతోపాటు ఆఫీసు కార్యాలయం, సిబ్బంది ఇళ్లు, గ్యారేజీ, తనిఖీల గది ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని దేశ రాజధాని నుంచి ఇకపై జాతీయ స్థాయికి విస్తరించనున్నట్లు కేజ్రీవాల్ అన్నారు. ‘ఆప్’ మంత్రులు అధికార వాహనాల్లో రాకపోకలు సాగిస్తుండటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అధికార వాహనాలను వినియోగించరాదని తానెప్పుడూ చెప్పలేదని, వాహనాలపై ఎర్రబుగ్గలు వాడటంపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు.

 ఆప్ మంత్రులకు ఇన్నోవా కార్లు

 అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గట్టెక్కే వరకూ సొంత కార్లలో, మెట్రో రైల్లో, ఆటోరిక్షాలో ప్రయాణించిన ‘ఆప్’ మంత్రులు శుక్రవారం అధికారిక వాహనాలలో (ఇన్నోవా కార్లు) అసెంబ్లీకి వచ్చారు. కేజ్రీవాల్ మినహా ఆరుగురు మంత్రులకు ఈ కార్లను ప్రభుత్వం కేటాయించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందన కోరగా తాము ఎర్ర బుగ్గ వాహనాలను వాడబోమని మాత్రమే చెప్పామని... అధికారిక వాహనాలను వాడబోమని చెప్పలేదని వ్యాఖ్యానించారు.

 పొదుపు అంటే ఇదేనా: బీజేపీ

 కేజ్రీవాల్ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వీఐపీ సంస్కృతికి తెరదించి పొదుపు చర్యలు పాటిస్తానన్నా కేజ్రీవాల్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం కాగానే సభ్యులు ఈ అంశాన్ని లెవనెత్తారు. ఆయన ప్రజలను పెడదోవ పట్టిస్తారని, విద్యుత్, నీటి సరఫరా విషయంలో ప్రజలను భ్రమింపచేశారని ఆరోపించారు. ఈ గుట్టు త్వరలోనే రట్టవుతుందన్నారు.

 స్పీకర్ ఎన్నికలోనూ ఆప్ సత్తా..: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ శాసనసభ స్పీకర్ ఎన్నికలోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో పార్టీ అభ్యర్థి ఎంఎస్ ధీర్‌కు 37 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జగదీష్ ముఖీ అకాలీదళ్ మద్దతుతో 32 ఓట్లను సొంతం చేసుకున్నారు.

 ‘ఆప్’లోకి కెప్టెన్ గోపీనాథ్

 బెంగళూరు: ఎయిర్ డెక్కన్, డెక్కన్ చార్టర్స్, డెక్కన్ 360 వంటి చౌక విమానయాన సేవల కంపెనీలు స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో తాను కూడా పాలుపంచుకున్నానని చెప్పారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

 ఆప్‌కు అమీర్ ప్రశంసలు

సామాన్యుడి పార్టీగా ప్రజల ముందుకు వచ్చి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరేందుకు బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ అడుగులు వేస్తున్నట్లు ఎన్డీటీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో ఆప్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. రాజకీయాలపై నమ్మకంపోతున్న ప్రస్తుత తరుణంలో ఆప్ ఒక భారీ అలలా వచ్చి మార్పుకు భరోసా ఇచ్చిందన్నారు. ఆ అలలో తాము కూడా సభ్యులు కావాలని చాలామంది కోరుకుంటున్నారని అమీర్ చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు