ధిక్కారం ఏమైంది? స్వరం మార్చిన సీఎం!

26 Apr, 2017 18:00 IST|Sakshi
ధిక్కారం ఏమైంది? స్వరం మార్చిన సీఎం!

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వరం మారింది. ఆయన ఓటమిని అంగీకరించారు. ఎంసీడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీని అభినందించడమే కాదు.. కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు.

నిజానికి సోమవారం వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ధిక్కార స్వరమే వినిపించారు. ఆప్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు నిజమైతే ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేపడతామని హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్‌ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆప్‌ నేతలు కూడా తమ పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని నిందించారు. ఢిల్లీలో మోదీ హవా లేదని, ఈవీఎంల హవా మాత్రమే ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. ఎంసీడీ ఫలితాల సరళిలో ఆప్‌ ఓటమి ఖాయమని తేలిన నేపథ్యంలో సీనియర్‌ నేతలు మనిష్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌తో కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ 'ఢిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ విజయం సాధించిన బీజేపీ అభినందనలు. ఢిల్లీ పురోగావృద్ధి కోసం ఎంసీడీలతో కలిసి పనిచేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు