ఇదో పెద్ద కుట్ర.. అసెంబ్లీలో బట్టబయలు చేస్తా: సీఎం

27 Sep, 2016 15:54 IST|Sakshi
ఇదో పెద్ద కుట్ర.. అసెంబ్లీలో బట్టబయలు చేస్తా: సీఎం

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నోటీసులు ఎదుర్కొంటున్న తన కేబినెట్‌లోని ఆర్థికశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అండగా నిలబడ్డారు. కావాలనే ఆప్‌ మంత్రులను కేసుల్లో ఇరికిస్తున్నారని, ఇందులో పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

ఐటీ సమన్ల నేపథ్యంలో మంగళవారం ఉదయమే జైన్‌ను పిలిపించుకొని సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడారు. మాజీ సీనియర్‌ ఐటీశాఖ అధికారి అయిన కేజ్రీవాల్‌ జైన్‌ అమాయకుడని, ఆయన పత్రాలన్నింటినీ తాను పరిశీలించాలనని, కావాలనే ఆయనను ఇరికించారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ’ ఒకవేళ అతను దోషి అయి ఉంటే మేమే అతన్ని గెంటేసే వాళ్లం. అతనికి మేం అండగా నిలిబడతాం’  అని అన్నారు. ఆప్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై కావాలనే కేసులు పెడుతున్నారని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని, ఈ కుట్రను శుక్రవారం అసెంబ్లీలో బట్టబయలు చేస్తామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ప్రశ్నించడానికి సత్యేందర్‌ జైన్‌కు ఐటీశాఖ సమన్లు జారీచేసింది. కాగా, ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది నాయకులు వివిధ కేసులలో ఇరెస్టయ్యారు. గతవారంలో కూడా ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతి, అమానతుల్లా ఖాన్‌లను అరెస్టుచేసినా, రెండు రోజుల్లోనే వాళ్లిద్దరూ బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు.

>
మరిన్ని వార్తలు