బ్యాంక్ క్యూలైన్లో నల్ల కుబేరులు కనిపించారా?

11 Nov, 2016 21:12 IST|Sakshi
బ్యాంక్ క్యూలైన్లో నల్ల కుబేరులు కనిపించారా?

న్యూఢిల్లీ: నల్లధనం, నకిలీ కరెన్సీలను పూర్తిగా నిర్మూలించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూస్తున్నాం.. అనుభవిస్తున్నాం. సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో కేంద్రం చర్యను సాహసోపేత నిర్ణయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మంగళవారం నాటి ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. రాత్రికి రాత్రే ఏటీఎంలో వందనోట్లు తీసుకునే విఫలయత్నం చేశారు. పెట్రోల్ బంకుల్లో క్యూలైన్ల సంగతి చెప్పనవసరమేలేదు. బుధవారం బ్యాంకుల బంద్ తో సమస్యలు ఇంకా ఝటిలం అయ్యాయి. దీంతో గురువారం ఉదయం బ్యాంకులు తెరిచే సమచానికే వందల మీటర్ల దూరం వరకు ఖాతాదారులు నిలుచున్న దృశ్యాలు కనిపించాయి.

శుక్రవారం ఏటీఎంలలో నగదు నింపుతామని ప్రభుత్వం ప్రకటించినా ఆమేరకు చర్యలు తీసుకోలేదు. ప్రజలు మళ్లీ బ్యాంకులవైపు పరుగులు తీశారు. ఇక్కడ ఉత్పన్నం అయ్యే ఒకేఒక్క ప్రశ్న.. బ్యాంక్ క్యూలైన్లలో ఒక్క నల్ల కుబేరుడైనా కనిపించాడా? కనీసం పెద్ద స్థాయి ఉద్యోగి ఒక్కరైనా దర్శనమిచ్చారా? ఉన్న కరెన్సీలో అధికశాతం రద్దయినా వారు భేషుగ్గా ఎలా మనగలుగుతున్నారు? రూ.500 నోటిస్తే రూ.400 చిల్లర ఇచ్చి, వంద కమిషన్ గా ఇస్తున్నవారికి ఆ డబ్బులు ఎక్కడివి? ఇవే ప్రశ్నలను ఘాటుగా సంధిస్తున్నారు ఒకప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమనేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో చోటుచేసుకున్న తోపులాటలు, నిరీక్షణల కారణంగా శుక్రవారం సుమారు నలుగురు ఖాతాదారులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా ఏ వెయ్యో, పదివేలో తీసుకోవడానికి వచ్చినవారే తప్ప నోట్లు డిపాజిట్ చేసినవాళ్లు కారు. ‘రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, రైతులు, పేద పెన్షనర్లు.. వీళ్లు తప్ప బ్యాంకుల ముందు క్యూలైన్లలో ఎవరున్నారు? బడాబాబులు బయటికి రాలేదేం? కొందరి వద్దకే రూ.100 నోట్ల బండిళ్లు ఎలా వెళ్లాయి? వాళ్లు 20 శాతం కమిషన్ తీసుకుని పేదలకు డబ్బులివ్వడమేంటి? 500,1000 నోట్లు రద్దవుతాయని వాళ్లకు ముందే తెలుసు అనడానికి ఇంతకంటే రుజువు కావాలా?’అని కేజ్రీవాల్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రశ్నించారు.

స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నవారితోపాటు దేశీయంగా నల్లధనం కలిగి ఉన్న 6000 మంది పైచిలుకు నల్ల బాబుల జాబితా 2011లోనే బయటపడిందని, జాబితా వెల్లడిలో స్వయంగా తానే కీలక పాత్ర పోశించానని కేజ్రీవాల్ అన్నారు. నాటి జాబితాలోని పేర్లను ప్రభుత్వాలు, కోర్టులు కూడా నిర్ధారించాయని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ కూడా నల్ల ధనం అంశాన్నే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారని గుర్తుచేశారు. ‘ఎన్నికలకు ముందు మోదీ చెప్పిన మాటలన్నీ అధికారంలోకి రాగానే మర్చిపోయారు. ఎందుకంటే ఆ 6000 మందిలో ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు. ఇంకా దారుణం ఏమంటే పాత నోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయం కూడా ఆ బడాబాబులకు ముందే చెప్పేశారు. దీంతో వాళ్లు ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసుకున్నారు. అందుకే క్యూలైన్లలో వాళ్లు మచ్చుకైనా అగుపించడం లేదు’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన దేశంలో నల్లధనం ఎవరెవరి దగ్గర ఉందో చిన్న పిల్లాడికి సైతం తెలుసు’అని గత డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను గుర్తుచేస్తూ.. ఆ విషయం తెలిసన తర్వాత కూడా మోదీ ఏమీ చెయ్యకుండా ఉండటం కుట్రలో భాగమేనని కేజ్రీవాల్ అన్నారు.

పెద్ద నోట్లు రద్దు ఆహ్వానించదగ్గ పరిణామామే అయినా, దాని స్థానంలో రూ.2000 నోటు తీసుకురావడం ఘోరాతిఘోరమని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. 2000 నోట్లు వల్ల నల్లధనం పెరుగుతుందే తప్ప తగ్గే సమస్యేలేదని ఆయన అంటున్నారు. ‘పాతనోట్లు రద్దవుతాయని ముందే తెలిసిన ఆ కొందరికే.. కొత్త 2000 నోట్లు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. కమిషన్ తీసుకుని నేరుగా బడాబాబుల ఇళ్లకు కోత్త నోట్లు చేరవేసే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. నల్ల బాబుల జోలికి పోకుండా దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ప్రధాని భ్రమలు కల్పిస్తున్నారని, సామాన్యులను ఇన్ని ఇక్కట్లు పెడుతోన్న మోదీని దేవుడు కూడా క్షమించడని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.